
అనంతపురం: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(Ketireddy venkatarami reddy) భూ దాహానికి, ధన దహానికి ఎంతో మంది బలయ్యారని బీజేపీ, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ(Gonuguntla suryanarayana) అన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మవరం డీఎస్పీ కార్యాలయం ముందు సూర్యనారాయణ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధర్మవరం ప్రజలు శాంతి కోరుకుంటారనే తాము ఐదేళ్లు శాంతియుతంగా ఉన్నామని తెలిపారు. గుడ్ మార్నింగ్ పేరుతో దౌర్జన్యాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడి ప్రసక్తే లేదని... దాడికి పాల్పడిన వారికి శిక్ష పడేలా చేస్తామని అన్నారు. ‘‘ఎంతమందిని చంపుతావ్.. నీ చంపుడు కార్యక్రమాలు తిమ్మంపల్లిలో చూసుకో ఇక్కడికి వలస వచ్చావ్. నాలుగు జతల బట్టలు పెట్టుకొని ధర్మవరం వచ్చావ్... వెయ్యి కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది’’ అంటూ ప్రశ్నించారు. ఇక్కడి పోలీసులు ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని గోనుగుండ్ల సూర్యనారాయణ ఆరోపించారు.