BJP Vs Congress : ఎక్కువ కార్లు కొనుక్కోండి... కమల్‌నాథ్‌కు బీజేపీ నేత సలహా...

ABN , First Publish Date - 2022-09-20T16:48:27+05:30 IST

మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌

BJP Vs Congress : ఎక్కువ కార్లు కొనుక్కోండి... కమల్‌నాథ్‌కు బీజేపీ నేత సలహా...

న్యూఢిల్లీ : మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌ (Kamal Nath)కు బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయవర్గీయ (Kailash Vijayvargiya) ఓ సలహా ఇచ్చారు. చాలా మంది పెద్ద నేతలు కాంగ్రెస్‌ (Congress)ను వదిలిపెట్టి, బీజేపీ (BJP)లో చేరాలని ప్రయత్నిస్తున్నారని, అందువల్ల ఎక్కువ కార్లు కొనుక్కోవాలని వ్యంగ్యంగా అన్నారు. స్వామి స్వరూపానంద సరస్వతి మహారాజ్‌కు నివాళులర్పించేందుకు కైలాశ్ జబల్‌పూర్‌ వచ్చారు. 


మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆదివారం మాట్లాడుతూ, కాంగ్రెస్‌ను వదిలిపెట్టి, బీజేపీలో చేరాలని ఎవరైనా అనుకుంటే, తాను వారికి తన కారును ఇచ్చి, పంపిస్తానని అన్నారు. కాంగ్రెస్‌ను వదిలిపోవాలనుకునేవారిని ఆపేది లేదన్నారు. ఎవరో కాంగ్రెస్‌ను వదిలిపోతే, కాంగ్రెస్ ఇక అయిపోయినట్లేనా? అని ప్రశ్నించారు. ‘‘బీజేపీలో తమ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని ఎవరైనా అనుకుంటే, నేను నా కారును వారికి ఇస్తాను. నేను ఎవరినీ అనునయించబోను’’ అని స్పష్టం చేశారు. 


ఈ నేపథ్యంలో కైలాశ్ విజయవర్గీయ స్పందిస్తూ, చాలా మంది పెద్ద నేతలు కాంగ్రెస్‌ను వదిలిపెట్టి, బీజేపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారని, అందువల్ల ఎక్కువ కార్లు కొనుక్కోవాలని వ్యంగ్యంగా అన్నారు. ‘‘కమల్‌నాథ్ ఆ విధంగా అనుకుంటే ఆయన కచ్చితంగా చాలా కార్లను కొనుక్కోవాలి. ఎందుకంటే చాలా మంది పెద్ద కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరడానికి ప్రణాళిక వేసుకుంటున్నారు’’ అన్నారు. స్వామి స్వరూపానంద సరస్వతి మహారాజ్‌కు నివాళులర్పించేందుకు కైలాశ్ జబల్‌పూర్‌ వచ్చారు. 


ఇదిలావుండగా, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాట్లాంలో జరిగిన  సభలో మాట్లాడుతూ, సొంత కార్యకర్తలను గౌరవించని పార్టీ ఇక ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తుందని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల గురించి పెద్ద నేతలు ఈ విధంగా మాట్లాడుతూంటే, వాళ్ళు తమ కార్యకర్తలకు ఏపాటి గౌరవం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. 


స్వామి స్వరూపానంద 

ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మహారాజ్ మధ్య ప్రదేశ్‌లోని నరసింఘ్‌పూర్‌లో ఆదివారం పరమపదించారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. శ్రీధామ్ జోటేశ్వర్ ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు పరమపదించారని ద్వారకా పీఠం (దండి స్వామి) స్వామి సదానంద్ మహరాజ్ (Swami Sadanand Maharaj) చెప్పారు. 


మోదీ సందేశం

స్వామి స్వరూపానంద పరమపదించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రగాఢ సంతాపం ప్రకటించారు. స్వామి అనుచరులందరికీ సంతాపం తెలిపారు. 


Updated Date - 2022-09-20T16:48:27+05:30 IST