Bjp Leader దారుణ హత్య

ABN , First Publish Date - 2022-05-26T15:02:26+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం చెన్నై పర్యటనకు రానున్న తరుణంలో ఆ పార్టీకి చెందిన జిల్లా స్థాయి నేత హత్యకు గురికావడం కలకలం రేపింది..

Bjp Leader దారుణ హత్య

- బెయిల్‌పై వచ్చి హత్య చేసిన రౌడీ 

- నిందితుల కోసం 4 బృందాల వేట


అడయార్‌(చెన్నై): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం చెన్నై పర్యటనకు రానున్న తరుణంలో ఆ పార్టీకి చెందిన జిల్లా స్థాయి నేత హత్యకు గురికావడం కలకలం రేపింది.. చింతాద్రిపేటలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఎస్సీ విభాగం సెంట్రల్‌ చెన్నై జిల్లా అధ్యక్షుడు బాలచందర్‌ మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగిన సమయంలో బాలచందర్‌ గన్‌మెన్‌ అక్కడ లేకపోవడం పలు అనుమానా లకు తావిస్తుంది. దీంతో ఆయన్ను పోలీసులు సస్పెండ్‌ చేశారు. ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే... భార్యాపిల్లలతో కీల్పాక్కంలోని నివసిస్తున్న బాలచందర్‌ పూర్వీకం చింతాద్రిపేట. అక్కడ ఆయన తల్లిదండ్రులు ఉంటున్నారు. దీంతో తల్లిదండ్రులతో పాటు తన స్నేహితులతో మాట్లా డేందుకు బాలచందర్‌ ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తుండేవారు. ఇదేవిధంగా మంగళవారం రాత్రి ఆయన చింతాద్రిపేటకు వచ్చారు. ఆ ప్రాంతంలోని స్వామినాయకన్‌ వీధిలోని ఒక హార్డ్‌వేర్‌ షాపు ముందు రాత్రి 8 గంటల సమయంలో బాలచందర్‌ తన స్నేహితులతో మాట్లాడుతుండగా, గన్‌మెన్‌ పక్కవీధిలో టీ తాగేందుకు వెళ్ళాడు. ఇదే అదనుగా భావించిన ముగ్గురు రౌడీల ముఠా బాలచందర్‌పై కత్తులతో దాడి చేసింది.  తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ రౌడీలు ఆయన వెంటపడి మరీ నరికారు. అది చూసిన చుట్టుపక్కలవారు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న చింతాద్రిపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాల చందర్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.   పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌, అదనపు కమిషనర్‌ అన్బు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 


నాలుగు బృందాల ఏర్పాటు

హంతకులను పట్టుకునేందుకు ట్రిప్లికేన్‌ డీసీపీ పగలవన్‌ నేతృత్వంలో నాలుగు ప్రత్యేక పోలీస్‌ బృందాలను ఏర్పాటుచేశారు.. ఈ బృందాలు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టగా హత్య చేసిన రౌడీల వివరాలను గుర్తించారు. అదే ప్రాంతానికి చెందిన ప్రదీప్‌ అనే రౌడీ తన అను చరులు సంజయ్‌, కలైవానన్‌తో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్టు కనుగొన్నారు. ఆ తర్వాత మృతుడు బాలచందర్‌ సోదరి అనిత ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు రౌడీలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలచందర్‌ సోదరుడు ఒకరు చింతాద్రిపేటలో బట్టల దుకాణం నడుపు తున్నారు. ఈ దుకాణానికి ప్రదీప్‌ మామూళ్ళ కోసం పదేపదే వెళ్ళేవాడు. ఈ విషయాన్ని బాలచందర్‌కు చెప్పడంతో ఆయన ఆ రౌడీలకు వార్నింగ్‌ ఇచ్చాడు. పైగా ప్రదీప్‌, అతని అనుచరులపై బాలచందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 


గన్‌మేన్‌ సస్పెన్షన్‌

ఈ హత్య జరిగిన తర్వాత బాలచందర్‌ గన్‌మేన్‌ బాలకృష్ణన్‌ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. బాలచందర్‌కు గన్‌మెన్‌ వున్నాడు. అయితే హత్య జరిగిన సమయంలో అతను టీ తాగుతానంటూ పక్కవీధికి వెళ్లడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఉన్నతాధికారులు అతనిని సస్పెండ్‌ చేశారు. 


 నేరచరిత్ర.... 

హత్యకు గురైన బాలచందర్‌ జీవితం నేర చరిత్రతో కూడున్నదేనని పోలీసులు చెబుతున్నారు. హిందూ మక్కల్‌ కట్చి జిల్లా నిర్వాహకుడిగా ఉన్న సమయంలో చింతాద్రిపేటలోని ఆ పార్టీ కార్యాలయం ముందు జంతు శిరస్సు వేసి, మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించాడన్న అభియోగాలపై పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిలుపై వచ్చిన బాలచందర్‌ సింగిల్‌ నంబరు లాటరీ టిక్కెట్లను విక్రయించినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అతనిపై ఇంకా పలు క్రిమినల్‌ కేసులు కూడా వున్నాయి. ఆయన్ను హిందూ మక్కల్‌ కట్చి పార్టీ నుంచి బహిష్కరించడం తో, అనంతరం బీజేపీలో చేరాడు. ప్రస్తుతం కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌కు బలమైన మద్దతుదారుడిగా గుర్తింపు పొందాడు. 


బెయిలుపై విడుదలై... 

వేరే కేసులో అరెస్టయిన ప్రదీప్‌.. వారం రోజుల క్రితం బెయిలుపై విడు దలయ్యాడు. అక్కడ నుంచి ప్రదీప్‌ నేరుగా బట్టల దుకాణానికి వెళ్ళి ఆయన్ను మరోమారు హెచ్చరించడమే కాకుండా బాలచందర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ బెదిరింపులపై కూడా వారు ప్రదీప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రదీప్‌.. పథకం ప్రకారమే తన సహచరులతో కలిసి బాలచందర్‌ను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 


స్నేహితులే ప్రత్యర్థులయ్యారు..

బాలచందర్‌ను హత్య చేసిన వారిని పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖ రౌడీ దర్గా మోహన్‌ (57) కుమారులు ప్రదీప్‌, సంజయ్‌ తమ స్నేహితులతో కలిసి ఈ హత్య చేసినట్టు నిర్థారిం చారు. హత్య చేసిన తర్వాత వీరంతా మోటారుసైకిల్‌పై శ్రీపెరంబుదూరు లోని తమ బంధువుల ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని అక్కడ నుంచి పారిపోయారు. దర్గా మోహన్‌, బాలచందర్‌ ఒకప్పుడు మంచి స్నేహితులని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆధిపత్య పోరులో వీరిద్దరూ విడి పోయారు. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీన తన రాజకీయ పలుకుబడితో ఒక కేసులో దర్గా మోహన్‌, ఆయన అల్లుడు దినేష్‌ కుమార్‌ (35)లను బాలచందర్‌ అరెస్టు చేయించారు. దీన్ని జీర్ణించుకోలేని మోహన్‌ కుమా రులు ప్రదీప్‌, సంజయ్‌లు తమ స్నేహితుడు కలైవానన్‌తో కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Updated Date - 2022-05-26T15:02:26+05:30 IST