ట్రంకురోడ్టుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రామిరెడ్డి కృష్ణారెడ్డి
కావలిలో బీజేపీ నేత నిరసన
కావలిటౌన్, మే 17: బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర కమిటీ మాజీ కార్యవర్గ సభ్యుడు రామిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ముసునూరు వద్ద ట్రంకురోడ్డుపై తన అనుచరులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ అట్టడుగున ఉన్న బీజేపీని జాతీయ స్థాయిలో బలోపేతం చేసి కేంద్రంలో మూడు దఫాలు అఽధికారం చేపట్టే విధంగా అద్వానీ చేసిన కృషి మరువలేమన్నారు. అలాంటి అద్వానీని బీజేపీ విస్మరించడం దుర్మార్గమని, ఆయన పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా పరిశీలించకపోవడం దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులకు అవమానకమరమన్నారు. అద్వానీ లాంటి గొప్ప నేతలనే పార్టీ విస్మరిస్తుందంటే సిద్ధాంతాలకు తిలోదకాలు పలికినట్లేనని, ఇక తనలాంటి చిన్న కార్యకర్తలకు దిక్కెవరి ప్రశ్నించారు. ఇప్పటికైనా అద్వానీ పేరు ప్రకటించాలని లేకపోతే ఢిల్లీ జంతర్‌మంతర్‌లో నిరాహార దీక్ష చేపట్టి పార్టీకి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.