ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి: ఎన్వీఎస్‌ఎస్

ABN , First Publish Date - 2021-12-02T19:11:58+05:30 IST

ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.

ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి: ఎన్వీఎస్‌ఎస్

హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులను టీఆర్ఎస్ నేతలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్‌ను తగ్గించి భారం తగ్గించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతోనే  ఆర్టీసీకి నష్టాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. నష్టాల నివారణకు చార్జీల పెంపే సరైన నిర్ణయం కాదని అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తే ఆ.. లెక్కలు ఎందుకు బయటకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రైసు మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యిందని ఆరోపించారు.


రైతుల పట్ల ఇంత ఘోరంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదన్నారు. మద్దతు ధరను ముందస్తుగా ప్రకటిస్తూ మోడీ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను రైతులు తమ పాలిట రాబందుగా ప్రజలు భావిస్తున్నారన్నారు. వరి ఎలా పండుతుందో కూడా తెలియని కేటీఆర్ కారుకూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో ఓడించినందుకు రైతులపై కేసీఆర్ కక్ష గట్టారని ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-12-02T19:11:58+05:30 IST