Vijayashanti: సామరస్యాన్ని కోరుకునేవారెవరూ వారణాసి కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టరు

ABN , First Publish Date - 2022-09-13T19:53:38+05:30 IST

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో దేవతా విగ్రహాలను పూజించే అంశంపై జిల్లా కోర్టు నిర్ణయం ఎంతో ఆనందదాయకమైన విషయమని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

Vijayashanti: సామరస్యాన్ని కోరుకునేవారెవరూ వారణాసి కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టరు

హైదరాబాద్: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు (Gnanavapi Masjid) ప్రాంగణంలో దేవతా విగ్రహాలను పూజించే అంశంపై జిల్లా కోర్టు నిర్ణయం ఎంతో ఆనందదాయకమైన విషయమని బీజేపీ నేత విజయశాంతి (Vijayashanti) అన్నారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేత (BJP Leader) స్పందిస్తూ... దేశంలోని కోట్లాది హిందువులకు సంతోషం కలిగించే నిర్ణయమని తెలిపారు. కాగా... ప్రాచీన ఆలయాలను హిందువులు మళ్లీ పునరుద్ధరించుకునే వీలు లేకుండా కాంగ్రెస్ సర్కార్ (Congres government) తీసుకొచ్చిన 1991 నాటి ప్రార్థన స్థలాల చట్టాన్ని ఎంఐఎం అధినేత (MIM Chief) అసదుద్దీన్ (Asaduddin) ఇప్పుడు ప్రస్తావించడం అర్థరహితమన్నారు. ఈ చట్టం ఉద్దేశాన్ని వారణాసి కోర్టు నిర్ణయం నీరుగారుస్తుందంటూ హైకోర్టులో అప్పీలు చేయాలనడం ఆయనకి ఎంత మాత్రం తగదని అన్నారు. హిందువుల పిటిషన్‌పై విచారణ కొనసాగింపు వల్ల ముస్లింలకు వచ్చే నష్టం ఏమీలేదని రాములమ్మ స్పష్టం చేశారు.


ఇక్కడ హిందువులు కోరుతోంది కేవలం నిత్య పూజలకి అవకాశం ఇమ్మని మాత్రమే అని చెప్పారు. ఆ పిటిషన్ జ్ఞానవాపిలో ముస్లింల ప్రార్థనలను అభ్యంతరం పెట్టడం లేదని.... అందువల్ల ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. హిందువులు అక్కడ పూజ చేసుకోవడానికి అవకాశం లభిస్తే ఈ పరిణామం ప్రత్యేకంగా ఎంఐఎం (MIM) వంటి మతశక్తులకు తప్ప, ఇంకెవ్వరికీ సహజంగానైతే వ్యతిరేకమైనది కానందువల్ల, సామరస్య వాతావరణాన్ని కోరుకునేవారు ఎవరైనా వారణాసి కోర్టు (Court of Varanasi) నిర్ణయాన్ని తప్పుపట్టరని విజయశాంతి పేర్కొన్నారు. 


కాగా... వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార గౌరీ, వినాయకుడు, ఇతర దేవీదేవతల విగ్రహాలకు హిందువులు రోజువారీగా పూజలు నిర్వహించుకునేలా ఆదేశించాలన్న హిందూ మహిళల పిటిషన్‌పై విచారణను కొనసాగించేందుకు జిల్లా కోర్టు సమ్మతించిన విషయం తెలిసిందే....

Updated Date - 2022-09-13T19:53:38+05:30 IST