దయచేసి మేలుకోండి.... స్త్రీని గౌరవించేలా సమాజాన్ని తీర్చిదిద్దుదాం: విజయశాంతి

Published: Tue, 03 May 2022 11:03:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దయచేసి మేలుకోండి.... స్త్రీని గౌరవించేలా సమాజాన్ని తీర్చిదిద్దుదాం: విజయశాంతి

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న అత్యాచారాలు దారుణాలపై బీజేపీ నేత విజయశాంతి ఫేస్‌బుక్ ద్వారా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వినడానికే జుగుప్స కలిగించే దారుణ అత్యాచారాలు గత కొద్ది రోజులుగా  కుదిపేస్తున్నాయన్నారు. ఈ నీచ కృత్యాలకు పాల్పడినవారిలో కొందరు బయటివారు కాగా...  మరికొందరు కుటుంబ సభ్యులే కావడం పరమ హేయమని మండిపడ్డారు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ పాపాత్ములకు పసిపిల్లలు, బాలికలు, నడి వయసు మహిళలనే తేడా లేదన్నారు. ఈ పరిణామాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకపోవచ్చు, కానీ ఇటీవల ఈ పాపాలు జరిగింది తెలుగు నేలపై కావడంతో సోషల్ మీడియా సహా మన చానెళ్లు, పత్రికలు ఏం చూసినా ఇవే కనిపిస్తూ అందరినీ నిలదీస్తున్నాయని బీజేపీ నేత అన్నారు.


ఎవరిది ఈ తప్పు? ప్రతి దానికీ ప్రభుత్వాలని, రాజకీయ నాయకులని మాత్రమే వేలెత్తి చూపడం వల్ల లాభం లేదని, వ్యక్తిగా మనమేం చేస్తున్నాం? ఇంట్లోని ఆడపిల్లకు అండగా నిలిచేలా అబ్బాయిలను మలుచుకుంటున్నామా? ఇటీవలి కాలంలో విద్యార్థి లోకం, యువతరం డ్రగ్స్ గుప్పిట్లో చిక్కుకుని మానసిక దౌర్భల్యాలకు లోనవడం కళ్లారా చూస్తున్నామని తెలిపారు. హైస్కూలు స్థాయిలో కూడా పిల్లలు మాదకద్రవ్యాల బారిన పడుతుండటం, గంజాయితో పార్టీలు చేసుకోవడం లాంటి ఘటనలు ఈ మధ్య కాలంలోనే కలకలం రేపాయన్నారు. ఇవిగాక మరోవైపు బైక్ రేసింగులు, బెట్టింగులు ఉండనే ఉన్నాయని అన్నారు. సిగ్గుపడేలా... తలదించుకునేలా సంచలన ఘటనలు జరిగినప్పుడల్లా కొన్ని రోజుల పాటు ర్యాలీలు, నిరసనలు చేసి ఆయాసంతో ఆగిపోవడం తప్ప... ఒక స్థిర సంకల్పంతో ఎంత మేరకు  విమెన్ ఫ్రెండ్లీ సమాజాన్ని నిర్మించుకున్నామో గుండెల మీద చెయ్యేసి చెప్పాలని విజయశాంతి ప్రశ్నించారు. 


సమాజంలో ఈ తీరు మారే వరకూ స్త్రీల ఉద్ధరణ పేరిట ఎన్ని పథకాలు పెట్టినా... ఒరిగేదేమీ ఉండదన్నారు. ఇంట్లో మొదలుపెట్టి స్కూలు, కాలేజీ, ఆఫీస్... ఇలా ప్రతి దశలోనూ స్త్రీని గౌరవప్రదంగా చూసే వాతావరణాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. దోషులకి ఒక పక్క శిక్షలు పడుతున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నాయంటే లోపం ఎక్కడుందనే పరిశోధన, సంస్కరణ వెను వెంటనే జరగాలన్నారు. ఇందుకు అందరం కలసి రావాలని పిలుపునిచ్చారు. ‘‘ఒకనాటి నా సందేశాత్మక చిత్రం ప్రతిఘటనను పదే పదే గుర్తు చేసుకోవలసిన అవసరం నేటికీ కనిపించడం దురదృష్టకరం. దయచేసి మేలుకోండి.... సృష్టికి మూలంగా నిలిచిన స్త్రీని గౌరవించేలా మన సమాజాన్ని తీర్చిదిద్దుకుందాం కదలి రండి’’ అంటూ విజయశాంతి పిలుపునిచ్చారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.