పంచాయతీ కార్మికుల జీతాలు పెంచకపోవడం సిగ్గుచేటు: Vijayashanti

ABN , First Publish Date - 2022-01-19T16:48:54+05:30 IST

పంచాయితీ కార్మికుల జీతాలు పెంపు విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేత విజయశాంతి విరుచుకుపడ్డారు.

పంచాయతీ కార్మికుల జీతాలు పెంచకపోవడం సిగ్గుచేటు: Vijayashanti

హైదరాబాద్: పంచాయతీ కార్మికుల జీతాల పెంపు విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేత విజయశాంతి విరుచుకుపడ్డారు. స్వరాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు మారుతాయని, నిరుపేదలైన తమకు జీతాలు పెరుగుతాయని ఆశపడ్డ గ్రామ పంచాయతీ కార్మికులకు కేసీఆర్ సర్కార్ పాలనలో నిరాశే మిగిలిందని అన్నారు.  ఎన్నోసార్లు ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కేసీఆర్‌తో సహా పల్లె ప్రగతిలో కార్మికులు అద్భుతంగా పనిచేశారని పొగిడారు తప్ప... వీరికి జీతాలు మాత్రం ఇప్పటి వరకు పెంచలేదన్నారు. పైగా రాష్టవ్యాప్తంగా ఉన్న 12,761 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల్లో 90 శాతం మంది బీసీ, ఎస్సీ వర్గాల నుంచే అత్యధికంగా ఉండగా... వీరు ఎన్నో ఏళ్ల నుంచి గ్రామాల్లో నీటి సరఫరా, డ్రైనేజీల క్లీనింగ్‌తో పాటు అన్ని పనులు చేస్తున్నట్లు బీజేపీ నేత చెప్పారు.


కాగా... వీరికి గతేడాది నుంచి స్కూళ్ల క్లీనింగ్ బాధ్యతను కూడా అప్పగించి, అదనపు భారాన్ని పెంచిన కేసీఆర్ సర్కార్ జీతం ఒక్క రూపాయి కూడా అదనంగా పెంచకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.  గ్రామాల్లోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల కార్మికుల జీతాలను తెలంగాణ సర్కారు 2014 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు పెంచిందన్నారు. కానీ... గ్రామాల శుభ్రతకు పాటుపడుతున్న సుమారు 36,500 మంది కార్మికులను మాత్రం రూ.8 వేల జీతానికే పరిమితం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీతాలు పెంచాలని ఈ కార్మికులు ఎన్నోసార్లు రాష్ట్ర సర్కార్‌ను కోరుతున్నా...పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పైగా కొత్త గ్రామ పంచాయతీలలో ఎన్నో ఖాళీలు ఏళ్లుగా వెక్కిరిస్తున్నప్పటికీ ఇప్పటి భర్తీ చేయకుండా పనిభారం పెంచడమే తెలిసిన కేసీఆర్ సర్కార్‌కు... జీతాలు పెంచాలనే సోయి లేకుండా పోయిందని స్పష్టంగా అర్ధమవుతోందన్నారు.  గ్రామాల పారిశుద్ధ్యానికి పాటు పడుతున్న ఈ కార్మికులను ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ గుర్తించి పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసిన కనీస వేతనం అందిస్తే మంచిది అంటూ విజయశాంతి హితవుపలికారు. 

Updated Date - 2022-01-19T16:48:54+05:30 IST