Advertisement

మీ చేతగానితనాన్ని కేంద్రంపై నెడతారా?

Apr 23 2021 @ 04:00AM

వ్యాక్సిన్‌ ధరపై కేటీఆర్‌ ట్వీట్‌ బాధ్యతరాహిత్యం

మంత్రులు కేటీఆర్‌, ఈటలపై బీజేపీ ధ్వజం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసి, ఈ నేరాన్ని కేంద్రంపైకి నెట్టే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. మీ చేతగానితనాన్ని కేంద్రంపైకి నెడతారా? అని నిలదీశారు. మంత్రుల వ్యాఖ్యలు బట్టకాల్చి మీద వేసిన చందంగా ఉన్నాయని, వ్యాక్సిన్‌ ధరలపై మంత్రి కేటీఆర్‌ బాధ్యతరాహిత్యంతో ట్వీట్‌ చేశారని విమర్శించారు. వ్యాక్సిన్‌ ధరలను కంపెనీలు నిర్ణయిస్తారన్న ఇంగితజ్ఞానం లేకపోవడం శోచనీయమన్నారు. కొవిడ్‌ నియంత్రణకు సీఎంఆర్‌ఎ్‌ఫకి వచ్చిన నిధులు ఎక్కడ ఖర్చుచేశారో వెల్లడించాలని, రెమిడెసివిర్‌ ఇంజక్షన్లపై మంత్రి కేటీఆర్‌ మాట్లాడింది నిజమా? లేక మంత్రి ఈటల మాట్లాడింది నిజమా? స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.


కేంద్రంపై మంత్రులు కేటీఆర్‌, ఈటల చేసిన విమర్శలను ఖండిస్తున్నట్లు తెలిపారు. అసలు ఆక్సిజన్‌ ఎన్ని టన్నులు అవసరమనేది మీకు అంచనా ఉందా? అన్ని రాష్ట్రాల్లో కరోనాపై సమీక్ష చేశారు. మీరు సమీక్షించారా? కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిందా? ఆయుష్మాన్‌ భారత్‌ను ఎందుకు అమలు చేయట్లేదు? ప్రభుత్వాసుపత్రుల్లో ఎందుకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు? కొవిడ్‌ మరణాలు, కేసుల సంఖ్యను ఎందుకు తగ్గించి చూపిస్తున్నరు? ఇందువల్ల ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది నిజం కాదా ? అని నిలదీశారు. కొవిడ్‌ నియంత్రణకోసం ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను, టెస్టింగ్‌ కిట్లను, మెడికల్‌ ఆక్సిజన్‌ను కొంతమంది బ్లాక్‌ చేసి సొమ్ముచేసుకుంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ ఉందా? అని ప్రశ్నించారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.