రోడ్డెక్కిన కాషాయదళం

ABN , First Publish Date - 2022-01-26T07:04:24+05:30 IST

అడుగడుగునా పోలీసుల ఆంక్షల నడుమ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం గుడివాడలో జరగాల్సిన సంక్రాంతి సంబరాలు సాదాసీదాగా ముగిశాయి.

రోడ్డెక్కిన కాషాయదళం
కలువపాముల వద్ద బీజేపీ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు

బీజేపీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగింపు సంబరాలు

గుడివాడ వెళుతున్న నేతల అరెస్టు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ/ఉంగుటూరు) : అడుగడుగునా పోలీసుల ఆంక్షల నడుమ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం గుడివాడలో జరగాల్సిన సంక్రాంతి సంబరాలు సాదాసీదాగా ముగిశాయి. ఈ సంబరాల ముగింపు సభలో బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొనాల్సి ఉంది. అయితే పోలీసుల నిర్బంధాల నడుమ ఎవరూ ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. దీంతో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ ఒక్కరే ఆ కార్యక్రమాన్ని ముగించారు. సంక్రాంతి సంబరాలకు హాజరయ్యేందుకు బీజేపీ నాయకులు వేర్వేరు మార్గాల్లో బయలుదేరారు. వారిలో సోము వీర్రాజు, ఆదినారాయణ రెడ్డి, నాగోతు రమేశ్‌ నాయుడు తదితరులను ఉంగుటూరు మండలం నందమూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా వారంతా రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు అరెస్టు చేసి, ఉంగుటూరు పీఎస్‌కు తరలించారు. పామర్రు మీదుగా గుడివాడ వెళుతున్న ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, పాతూరి నాగభూషణం తదితరులను పెదపారుపూడి వద్ద అడ్డుకుని, తోట్లవల్లూరు స్టేషన్‌కు తరలించారు. అందరినీ సాయంత్రం విడుదల చేశారు. 


ఆరని కేసినో జ్వాలలు!

గుడివాడ : బీజేపీ ‘చలో గుడివాడ’ పిలుపు పట్టణంలో ప్రకంపనలు సృష్టించింది. ఆ పార్టీ నేతలు కేసినో నిర్వహించిన ప్రాంతాన్ని సందర్శిస్తారనే సమాచారంతో ఉదయం నుంచే కె.కన్వెన్షన్‌ వద్ద వైసీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. గుడివాడలో బీజేపీ సంక్రాంతి సంబరాల ఏర్పాట్లపై వైసీపీ దాడి చేయగా, పోలీసులు పట్టణానికి వచ్చే దారులన్నింటినీ దిగ్బంధనం చేసి, ఇక్కడికి పయనమైన తమ నాయకులను దారిలోనే అరెస్టు చేయడంపై బీజేపీ మండిపడుతోంది. గుడివాడ ఎవరూ రావొద్దనడానికి మంత్రి కొడాలి నాని ఎవరని ప్రశ్నిస్తూ, కేంద్ర బలగాల సహకారంతో రాష్ట్రం నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలతో గుడివాడకు మహాయాత్ర చేసి తీరుతామని ఆ పార్టీ అగ్రనాయకులు సవాల్‌ విసరడంతో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయోనని స్థానికులు భీతిల్లుతున్నారు.

Updated Date - 2022-01-26T07:04:24+05:30 IST