కమలనాథుల.. చీకటి డీల్‌!

ABN , First Publish Date - 2021-03-01T08:31:55+05:30 IST

బీజేపీలో వారిద్దరూ కీలక నేతలు. వారిలో ఒకాయన కేంద్రంలో కేబినెట్‌ హోదా పదవిలో ఉన్నానని చెప్పుకొంటూ ఉంటారు. రాయలసీమలో నడిచే ఓ ప్రముఖ ఆశ్రమాన్ని రూ.400 కోట్ల మేర ఆర్థిక

కమలనాథుల.. చీకటి డీల్‌!

ఇద్దరు బీజేపీ నేతలు.. రూ.30 కోట్ల దందా

రెండేళ్ల కిందట సీమలోని ఆశ్రమంలో సోదాలు

రూ.400 కోట్లకు పైగా అనధికార లావాదేవీలు

సాయం పేరుతో రంగంలోకి రాష్ట్ర బీజేపీ నేత

మరో కీలక నాయకుడి సంపూర్ణ సహకారం?

తిరుపతిలో మంతనాలు.. 30 కోట్లు వసూలు

నిగ్గుతేల్చిన కేంద్ర నిఘా సంస్థలు!

జాతీయ నాయకత్వం కన్నెర్ర

ఆ రెండు పెద్ద తలకాయలపై వేటు!

అమిత్‌ షా వచ్చి వెళ్లాక చర్యలు?

పార్టీ నుంచి సస్పెన్షనా.. జైలా?

బీజేపీ వర్గాల్లో ఇదే చర్చ


బీజేపీలో వారిద్దరూ కీలక నేతలు. వారిలో ఒకాయన కేంద్రంలో కేబినెట్‌ హోదా పదవిలో ఉన్నానని చెప్పుకొంటూ ఉంటారు. రాయలసీమలో నడిచే ఓ ప్రముఖ ఆశ్రమాన్ని రూ.400 కోట్ల మేర ఆర్థిక అవకతవకల నుంచి బయటపడేసేందుకు వీరిద్దరూ సాయం చేసి.. అందుకు ప్రతిఫలంగా రూ.30 కోట్లు తీసుకున్న చీకటి ఒప్పందం తాజాగా బట్టబయలైంది. కేంద్ర నిఘా సంస్థల ద్వారా దీనిని రూఢి చేసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం.. వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర బీజేపీలోని ఇద్దరు నేతలు అత్యంత రహస్యంగా చేసిన ఒక పెద్ద డీల్‌.. ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లింది. అక్రమాలు కప్పిపుచ్చుతామంటూ కోట్ల రూపాయలు వసూలు చేసిన వైనంపై కన్నెర్ర చేసి.. మరింత లోతుగా ఆరా తీయించారు. ఇది నిజమేనని కేంద్ర నిఘా సంస్థలు ఆధారాలతో రుజువు చేసినట్లు సమాచారం. దరిమిలా రాష్ట్ర బీజేపీలోని ఆ రెండు పెద్ద తలకాయలపై వేటు పడే అవకాశముందని  ప్రచారం జరుగుతోంది. బీజేపీలోని ప్రముఖుల్లో చర్చనీయాంశమైన ఈ బాగోతం లోతుల్లోకి వెళితే.. రాయలసీమలోని ఒక ఆశ్రమంలో అక్రమ సొమ్ము ఉన్నట్లు కేంద్ర నిఘా సంస్థలకు రెండేళ్ల క్రితం సమాచారం అందింది.


రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయ పన్ను (ఐటీ) విభాగం రూ.400 కోట్లకు పైగా అనధికారిక లావాదేవీలను గుర్తించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టడంతో దిక్కుతోచని ఆశ్రమ నిర్వాహకులు ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న తరుణంలో.. రాయలసీమకు చెందిన ఒక బీజేపీ నాయకుడు కబురు పెట్టాడు. ఒకప్పుడు పార్టీ ఎమ్మెల్యే కార్యాలయంలో పనిచేసే ఆ వ్యక్తికి.. మాటలు చెప్పడంతో పాటు అధికారంలో ఉన్న నేతలను బుట్టలో వేసుకుని ఇప్పటికే కోట్లు గడించారన్న పేరుంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రితో భారీ లావాదేవీలు జరిపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా తన సామాజిక వర్గానికే చెందిన కేబినెట్‌ ర్యాంకు నేతతో బెంగళూరులో భారీగా పైరవీలు చేస్తుంటారని అంటుంటారు. ఇంత అనుభవం ఉన్న ఆయన రంగంలోకి దిగడంతో ఆశ్రమానికి చెందిన కీలక వ్యక్తి ముందుకొచ్చారు. తిరుపతిలో కూర్చుని చర్చలు జరిపారు.


తనకు కేబినెట్‌ మంత్రి హోదా పదవి  ఉందని.. తాను చెబితే ఢిల్లీ నుంచి సదరు కేసు దర్యాప్తు అధికారులే ఇక్కడకు వస్తారని నమ్మబలికారు. దీంతో ఆశ్రమంలోని కీలక వ్యక్తి ఆ నాయకుడి సాయం కోరారు. రాష్ట్రానికి తరచూ వచ్చి వెళ్లే మరో ప్రముఖ నేతతో చర్చించి.. మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు 30 కోట్ల రూపాయలకు డీల్‌ కుదుర్చుకున్నారు. ఇద్దరూ కలిసి తిరుపతిలో చర్చలు జరిపి.. అసలు కేసు ఏంటి.. అది వీగిపోవడానికి చేయాల్సిన సాయమేంటి.. మొదలైన వివరాలను కేంద్ర సంస్థకు చెందిన ఒక కీలక అధికారితో చెప్పించినట్లు తెలిసింది. బయటకు తెలియని కొన్ని విషయాలు వెల్లడి కావడంతో ఆశ్రమ నిర్వాహకుడు వారిని మరింత నమ్మారు. తిరుపతిలోనే రూ.30 కోట్లు చెల్లించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. జనవరి-ఫిబ్రవరి మధ్య జరిగిన ఈ వ్యవహారం కేంద్ర పెద్దల దాకా వెళ్లింది. కేంద్ర నిఘా సంస్థలు అప్పటికే కొంతమేర సమాచారం ఇచ్చినందున వారు మరింత లోతుగా విచారణ చేయించారు. అప్పుడీ మొత్తం వ్యవహారం బయట పడింది.


3-7-20..

ఈ ఒప్పందంలో భాగంగా రాయలసీమ నేతకు పది శాతం అంటే రూ.3 కోట్లు అందాయి. ఆ తర్వాత వేరే రాష్ట్రం నుంచి వచ్చి తిరుపతిలో మకాం వేసి ఢిల్లీ నుంచి కేంద్ర సంస్థ అధికారి(నిజమైన వ్యక్తో కాదో)ని రప్పించిన మరో నేతకు రూ. 7 కోట్లు అందించారు. మిగతా రూ.20 కోట్లూ ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర సంస్థ అధికారికి అని చెప్పి తీసుకున్నారు. ఇలా ముప్పై కోట్ల పంపకాలకు సంబంధించిన వివరాలను కేంద్ర నిఘా సంస్థలు సేకరించాయి. ఈ కథ ఏ రోజు నుంచి మొదలైంది.. ఎవరు పథక రచన చేశారు..?  తిరుపతికి ఎక్కడి నుంచి తీసుకొచ్చా రు.? ఏ బ్యాంకు నుంచి అంత మొత్తం డ్రా చేశా రు..? ఢిల్లీ నుంచి సదరు అధికా రి ఏ విమానంలో వచ్చారు.. డబ్బులు మారినట్లు చెబుతున్న రోజు ఆ ప్రాంతంలో ఉన్న సెల్‌ నంబర్లు.. ఒప్పందంపై ఆశ్రమ నిర్వాహకులను విచారించినప్పుడు ఏం చెప్పారు..? ఇలాంటి 56 అంశాలతో అవి సమగ్ర నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. 


వేటేనా.. జైలా..?

అవినీతి విషయంలో ప్రధాని మోదీ కఠినంగా ఉంటారని.. అక్రమాలను ఉపేక్షించరని బీజేపీలో ప్రచారం జరుగుతోంది. ఈ డీల్‌ వెనుక ఉన్న ఇద్దరు రాష్ట్ర నేతలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి సరిపెడతారా? లేక ఇంకెవరూ ఇలాంటి పన లు చేయకుండా ఏకంగా జైలుకే పంపుతారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైం ది. తిరుపతి ఉప ఎన్నిక పేరు చెప్పి ఇప్పటికే కొంత మంది నేతలు వసూళ్ల పర్వానికి దిగడంతో ఇటీవల ఢిల్లీ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ, ఐటీ లాంటి సంస్థలను మేనేజ్‌ చేస్తామంటూ ఒప్పందాలు కుదుర్చుకున్నవారికి కచ్చితంగా జైలు తప్పదని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరో నాలుగు రోజుల్లో కేంద్ర మంత్రి అమిత్‌ షా తిరుపతి పర్యటన ఉండడంతో.. ఆయన వచ్చి వెళ్లాక ఆ ఇద్దరి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-03-01T08:31:55+05:30 IST