రెండ్రోజుల్లో యడియూరప్ప వారసుడి ప్రకటన..

ABN , First Publish Date - 2021-07-27T16:35:25+05:30 IST

కర్ణాటక అపద్ధర్మ ముఖ్యమంత్రి బీఎస్ యడయూరప్ప స్థానంలో కొత్త ముఖ్యమంత్రి పేరును కేంద్రం..

రెండ్రోజుల్లో యడియూరప్ప వారసుడి ప్రకటన..

న్యూఢిల్లీ: కర్ణాటక అపద్ధర్మ ముఖ్యమంత్రి బీఎస్ యడయూరప్ప స్థానంలో కొత్త ముఖ్యమంత్రి పేరును కేంద్రం రెండు రోజుల్లో ప్రకటించనుంది. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని మంగళవారం ఉదయం ప్రారంభమైన  పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్, కర్ణాటక ఇన్‌చార్జి అరుణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


కాగా, యడియూరప్ప రాజీనామా అనంతర పరిస్థితులపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌షా, పార్లమెంటరీ, పార్లమెంటరీ వ్యవహారాలు, గనుల శాఖ మంత్రి ప్రహ్లోద్ జోషి ఢిల్లీలో రహస్య మంతనాలు జరిపినట్టు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ పరిశీలకులను మంగళవారంనాడు కర్ణాటకకు పంపాలనే నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, సీనియర్ నేతలు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్‌లు రాష్ట్ర పరిశీలకులుగా వెళ్లనున్నారు. బుధవారం రోజంతా బీజేపీ ఎమ్మెల్యేలతో పరీశీలకుల బృందం సుదీర్ఘ మంతనాలు జరపనుంది. సీనియర్ నేతల అభిప్రాయాలు క్రోడీకరించిన అనంతరం గురువారంనాడు జరిగే లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఒక ప్రకటన చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.


కాగా, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందని బీజేపీ కర్ణాటక యూనిట్ అధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్, అరుణ్ సింగ్ ఇప్పటికే ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందన్నారు. గురువారంనాడే కొత్త సీఎం ప్రమాణస్వీకారం కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-07-27T16:35:25+05:30 IST