బెంగాల్ ఫైట్.. సిద్ధమైన బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా!

ABN , First Publish Date - 2021-03-06T22:06:57+05:30 IST

ఎన్నికల్లో బరిలోకి దిగే గెలుపు గుర్రాలను ఇప్పటికే గుర్తించిన అధిష్టానం

బెంగాల్ ఫైట్.. సిద్ధమైన బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా విజయ బావుటా ఎగరేయాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకోసం అవసరమైన అస్త్రశస్త్రాలను ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఎన్నికల్లో బరిలోకి దిగే గెలుపు గుర్రాలను గుర్తించిన అధిష్టానం రేపు (ఆదివారం) తొలి దశ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.


ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తం 60 మంది అభ్యర్థులు, వారు పోటీ చేయనున్న స్థానాలతో కూడి జాబితాను విడుదల చేయనుంది. 


తొలి రెండు దశల కోసం ఒక్కో స్థానానికి సగటున నలుగురైదుగురి పేర్లను బీజేపీ షార్ట్ లిస్ట్ చేసింది. ఈ నెల 4న తుది జాబితాను రెడీ చేసింది. ఇటీవల టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారికి నందిగ్రామ్ స్థానం కేటాయించినదీ, లేనిదీ తెలియరాలేదు. అదే స్థానం నుంచి ముఖ్యమంత్రి మమత బెనర్జీ బరిలోకి దిగుతున్నారు. సువేందుకు కూడా అదే స్థానం నుంచి పోటీకి దిగితే ఎన్నికలు రసవత్తరంగా మారుతాయి. 


నిజానికి నందిగ్రామ్‌పై సువేందు అధికారికి మంచి పట్టుంది. బీజేపీలో చేరకముందు టీఎంసీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర రవాణా, నీటిపారుదల, వాటర్ వేస్‌ శాఖలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. అయితే, ఆ తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి.


రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 వరకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ రేపు కోల్‌కతాలో పర్యటించనుండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని ర్యాలీకి కనీసం 10 మందికి సమీకరించాలని బీజేపీ యోచిస్తోంది. 

Updated Date - 2021-03-06T22:06:57+05:30 IST