కాంగ్రెస్ నేతపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నుంచే విమర్శలు

Published: Fri, 01 Apr 2022 17:31:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కాంగ్రెస్ నేతపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నుంచే విమర్శలు

ముంబై: భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కారణం.. కాంగ్రెస్ నేతపై ఆయన చేసిన వ్యాఖ్యలు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కి ఉప ఎన్నిక జరుగుతోంది. ఆ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ నేత చంద్రకాంత్ జాదవ్ మరణించడంతో ఆ స్థానంలో ఆయన భార్య జయశ్రీ పాటిల్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. అయితే కొల్హాపూర్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ధనుంజయ్ మహదిక్.. జయశ్రీ పాటిల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘‘కాంగ్రెస్ నేతలు ఒక మహిళా అభ్యర్థిని బరిలోకి దింపారు. ఆమె నిస్సహాయురాలు. ఆమెకు ఓటు వేయండి. కాకపోతే, ఎవరికి చేతనైనా పని, ఎవరికి వచ్చిన పని వారు చేయాలి. కానీ ఒక ప్లంబర్ చనిపోతేనో ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతేనో ఆ పని వాళ్ల భార్యను చేయమంటే ఎట్లా?’’ అని ధనుంజయ్ అన్నారు. దీనిపై మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు చిత్ర వాఘ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ధనుంజయ్ పేరు ప్రస్తావించకుండానే ‘‘ఝాన్సీ కోసం లక్ష్మీ బాయి పోరాటం చేశారు. ఛత్రపతి శివాజీకి జిజు బాయి జన్మనిచ్చారు. ఔరంగాజేబును మోకాళ్లపై నిల్చొబెట్టిన ధీరవనిత మహారాణి తారాబాలియి. ఇలాంటి మహిళల్ని ఎందరో ఉన్నారు. స్త్రీలను అవమానించడం కాదు, ముందు గౌరవించడం నేర్చుకోండి’’ అంటూ చురకలు అంటించారు.

అయితే ఆమెను ప్రత్యక్షంగా కలిసి ధనుంజయ్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా ‘‘నేను కొల్హాపూర్ వెళ్తున్నాను. వెళ్లాక ధనుంజయ్ చేసిన వ్యాఖ్యలపై నేను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడతాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు. ఒకరు ఇలాంటివి చేస్తే ఇంకొకరు ఇలాంటివే అనుసరిస్తారు. క్రమంగా మహిళల్ని టార్గెట్ చేయడం ఫ్యాషన్ అవుతుంది. మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో ప్రతి ఒక్క నాయకుడు ఒకసారి ఆలోచించాలి’’ అని వాఘ్ అన్నారు.

కాగా, ధనుంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా విభాగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళలపై వివాదాస్పద, సంకుచిత వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు అలవాటేనన్న కాంగ్రెస్ నేతలు.. బీజేపీపై పోరాటానికి జయశ్రీ పాటిల్‌ సమర్ధురాలని, బలమైన నేతని చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్యర్థిని జయశ్రీ పాటిల్‌ ఓడిస్తారని, ఆమెకు పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని కాంగ్రెస్ నేత సతేజ్ పాటిల్ అన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.