అవమానించిన వ్యక్తికి అందలమా..?

ABN , First Publish Date - 2022-05-25T17:45:56+05:30 IST

రాష్ట్రంలో ఒక వివాదం సద్దుమణిగితే మరో వివాదం రాజుకుంటోంది. తాజాగా పాఠ్యాంశాలలో మార్పులు, చేర్పులు చేసేందుకు ఉద్దేశించిన కమిటీకి చైర్మన్‌గా రోహిత్‌

అవమానించిన వ్యక్తికి అందలమా..?

- పాఠ్యపుస్తకాల సంస్కరణల కమిటీ చైర్మన్‌ రోహిత్‌ చక్రతీర్థకు సెగ

- 31న పలు సంఘాల నిరసన

- కమిటీ రద్దుకు బీజేపీ ఎమ్మెల్సీ డిమాండ్‌ 


బెంగళూరు: రాష్ట్రంలో ఒక వివాదం సద్దుమణిగితే మరో వివాదం రాజుకుంటోంది. తాజాగా పాఠ్యాంశాలలో మార్పులు, చేర్పులు చేసేందుకు ఉద్దేశించిన కమిటీకి చైర్మన్‌గా రోహిత్‌ చక్రతీర్థను నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘ్‌పరివార్‌ నేపథ్యం కల్గిన చక్రతీర్థకే తాజాగా పీయూసీ చరిత్ర పాఠ్యాంశాలలోనూ మార్పులు, చేర్పులు జరిపేందుకు అవకాశం కల్పించడం మరింత వివాదానికి దారి తీసింది. ఐదేళ్ల క్రితం ‘రాష్ట్రకవి’ కువెంపును అవహేళన చేస్తూ చక్రతీర్థ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టును కాంగ్రెస్‌ వెలుగులోకి తీసుకురావడంతో వివాదం మరింతగా రాజుకుంది. రాష్ట్రకవి కువెంపును అవమానించిన చక్రతీర్థను పాఠ్యాంశాల మార్పుల చేర్పుల కమిటీకి చైర్మన్‌గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే ప్రశ్నించారు. బీజేపీ త నకు అనుకూలంగా ఉండేవారిని ఇలాంటి పదవులలో నియమించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య స్పందిస్తూ ఆర్‌ఎస్ఎస్‌ సంస్థాపకుడు హెగ్డేవార్‌ పాఠాలను ప్రవేశ పెట్టిందని, చూస్తుంటే రానున్న రోజుల్లో జాతిపిత గాంధీజీని కిరాతకంగా హతమార్చిన నాథూరాం గాడ్సే పాఠాలు కూడా చదవాల్సి వస్తుందేమోనని ఎద్దేవా చేశారు. కువెంపును అవమానించిన చక్రతీర్థను తొలగించాలని పలు కన్నడ సంఘాలు ఇప్పటికే డిమాండ్‌ చేస్తున్నాయి. ఈనెల 31న బెంగళూరు ఫ్రీడంపార్కులో భారీ ప్రదర్శనకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎ్‌ఫఐ)తోపాటు ఎన్‌ఎ్‌సయూఐ తదితర పదికిపైగా విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరగనుంది. 


కమిటీని రద్దు చేయాలి: బీజేపీ ఎమ్మెల్సీ

పాఠ్యపుస్తకాల మార్పులు, చేర్పుల కమిటీని రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్‌ విశ్వనాథ్‌ డిమాండ్‌ చేశారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియమాలను గాలికి వదిలి ఈ కమిటీ ఒకే మతానికి గొడుగు పడుతోందని, ఇది దేశ ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు కాగలదని హెచ్చరించారు. పాఠ్యపుస్తకాల సంస్కరణ కమిటీలో అన్ని మతాల, కులాల విద్యానిపుణులకు, చరిత్రకారులకు అవకాశం కల్పించాలన్నారు. ఇందుకు భిన్నంగా ఈ కమిటీ మొత్తం సంఘ్‌పరివార్‌ నేపథ్యం కల్గినవారితోనే నిండిపోయిందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాల ఆరోపణలు బుజ్జగింపు రాజకీయాల్లో మరో భాగమన్నారు. కమిటీలో అందరికీ ప్రాతినిథ్యం కల్పించామన్నారు. చరిత్ర పాఠాలను గతంలో కాంగ్రెస్‌ హయాంలో అ పహాస్యం చేశారని, ఈ తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు. మరో అడుగు ముందుకేసి మతోన్మాది టిప్పు సుల్తాన్‌ పాఠాలు నేర్పాలా.. దేశభక్తుల పాఠాలు నేర్పాలా..? అని ప్రశ్నించారు. పాఠ్యపుస్తకాల నుంచి కువెంపు పాఠాలను తొలగించలేదని కర్ణాటక పాఠ్యపుస్తకాల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియాలో వస్తున్న కథనాలను సంస్థ నిరాధారమైనవని కొట్టిపారేసింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విద్యను కాషాయమయం చేస్తోందని, సమాజంలో పేదల బతుకును సైతం విద్వేషభరితం చేసిందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ నిప్పులు చెరిగారు. 

Updated Date - 2022-05-25T17:45:56+05:30 IST