
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి తృణమూల్ కాంగ్రెస్(TMC)లోకి చేరికల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు, బర్రాక్‌పోర్ (Barrackpore) లోక్‌సభా అభ్యర్థి అర్జున్ సింగ్ (Arjun Singh) టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి (General Secretary) అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) సమక్షంలో ఆయన తృణమూల్ కండువా కప్పుకున్నారు. దీనికి కొద్ది సమయం ముందు పార్టీ నాయకత్వం తనను పని చేయనీయడం లేదంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారు.
జనపనార క్వింటాల్ ₹ 6,500లకు పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవడంపై అర్జున్ సింగ్ తీవ్ర అసంతృప్తి చెందారు. జూట్ మిల్లుల సమస్యను కొద్ది రోజులుగా అర్జున్ సింగ్ లేవనెత్తుతున్నారు. దీనికి కొంత మంది శాసనసభ్యుల మద్దతు కూడా ఉంది. ఈ విషయమై రాష్ట్ర బీజేపీ యూనిట్‌తో సైతం అర్జున్ సింగ్‌కు వివాదాలు తలెత్తాయి. అయితే కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఢిల్లీ పెద్దల్ని కలవడానికి వెళ్లినట్లు సమాచారం. బీజేపీపై అసంతృప్తితో ఉన్న అర్జున్ సింగ్‌తో టీఎంసీ నేతలు కొంత కాలంగా చర్చలు జరుపుతున్నారట. పార్టీ మారే ప్రయత్నాల్ని ఆపేందుకు బీజేపీ బుజ్జగింపులు చేసినప్పటికీ అవి ఫలించలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు టీఎంసీని వీడి బీజేపీకి వెళ్లిన అర్జున్ సింగ్.. మూడు ఏళ్లు తిరిగే సరికి సొంతగూటికి వచ్చారు.
ఇవి కూడా చదవండి