
న్యూఢిల్లీ: ఏపీ అసెంబ్లీలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం దురదృష్టకరమని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గురించి దేశమంతా సిగ్గుగా మాట్లాడుకుంటున్నారని తెలిపారు. అసెంబ్లీ సభ్యత, సంస్కారాన్ని మంటగలిపారని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం దురదృష్టకరమని... మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలని హితవుపలికారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరేమి మాట్లాడారో అందరికీ తెలుసని, ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఏపీని వరదలు ముంచెత్తినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెయ్యేరు డ్యాం గేట్లు పనిచేయకపోవడంతో తీరని నష్టమన్నారు. అధికారులను అప్రమత్తం చేసే ప్రజాప్రతినిధులు లేరని తెలిపారు. ప్రజలను పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం వికృత రాజకీయ క్రీడలకు దిగుతోందని మండిపడ్డారు. అసెంబ్లీని ఒక రోజు వాయిదావేసైనా ప్రజలు, మూగజీవాలను పట్టించుకోవాలని ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు.