రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం

ABN , First Publish Date - 2022-02-03T19:39:42+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభా హక్కులను ఉల్లంఘించినట్లు

రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభా హక్కులను ఉల్లంఘించినట్లు బీజేపీ ఎంపీ నిసికాంత్ దుబే ఆరోపించారు. గాంధీ బుధవారం లోక్‌సభలో ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారన్నారు. ప్రభుత్వం రాష్ట్రాల యూనియన్‌ను ఓ రాజ్యంగా చేసుకుని పరిపాలిస్తూ భారత దేశ భావనను నాశనం చేస్తోందన్నారని తెలిపారు. గాంధీపై ఆయన గురువారం సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసు ఇచ్చారు. 


రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జనవరి 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ బుధవారం లోక్‌సభలో మాట్లాడారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత స్వభావంతో పరిపాలిస్తోందని, దీనివల్ల భారత దేశ ప్రజలు, సంస్కృతులు, భాషలు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ స్వభావానికి ప్రమాదం జరుగుతుందని ఆరోపించారు. భారత రాజ్యాంగం ప్రకారం భారత దేశం ఓ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని, కానీ బీజేపీ ఈ దేశాన్ని బెత్తంతో పరిపాలించాలని కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. 


ఈ నేపథ్యంలో దుబే సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రతిపాదించారు. రాహుల్ గాంధీ ఓ స్క్రిప్ట్ రీడర్ అని, డ్రాయింగ్ రూమ్ పొలిటీషియన్ అని పేర్కొన్నారు. ఆయన కనీసం రాజ్యాంగ ప్రవేశికను అయినా చదవలేదని అన్నారు. 


‘‘భారత దేశ ప్రజలమైన మేము భారత దేశాన్ని సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలని సత్యనిష్ఠతో దృఢంగా నిర్ణయించుకున్నాం’’ అని రాజ్యాంగ ప్రవేశికలో ఉందని దుబే తన నోటీసులో తెలిపారు. గణతంత్ర అనే పదాన్ని ఉపయోగించినందువల్ల అన్ని విధాలుగానూ భారత దేశం ఓ దేశమని స్పష్టమవుతోందని చెప్పారు. ఈ సరళమైన విషయాన్ని రాహుల్ గాంధీ అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. 


రాహుల్ గాంధీ సభా హక్కులను ఉల్లంఘించారని, సభను ధిక్కరించారని, నిబంధనల ప్రకారం ఆయన శిక్షార్హుడని తెలిపారు. తన ప్రసంగం ద్వారా ఆయన ప్రజలను, ఎంపీలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారన్నారు. 


Updated Date - 2022-02-03T19:39:42+05:30 IST