వృషభాలకు విత్తు కొట్టొద్దు...BJP ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌కు కాంగ్రెస్ మద్దతు

ABN , First Publish Date - 2021-10-16T18:28:20+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వృషభాలకు విత్తు కొట్టడాన్ని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వ్యతిరేకించారు...

వృషభాలకు విత్తు కొట్టొద్దు...BJP ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌కు కాంగ్రెస్ మద్దతు

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వృషభాలకు విత్తు కొట్టడాన్ని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వ్యతిరేకించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మధ్యప్రదేశ్  రాష్ట్రవ్యాప్తంగా ఉత్పాదకత లేని,నాసిరకం ఎద్దులను నివారించేలా ఎద్దులకు విత్తు కొట్టాలని నిర్ణయించింది. దీని కోసం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్ల బడ్జెట్ కేటాయించి 12 లక్షల ఎద్దులకు విత్తు కొట్టేందుకు  ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళికను బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ వ్యతిరేకించగా కాంగ్రెస్ నేతలు ఆమెకు మద్ధతుగా నిలిచారు.మధ్యప్రదేశ్‌లో అరుదైన రాజకీయ సంఘీభావంలో అధికార బీజేపీ,విపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసిపోయి వృషభాలకు విత్తు కొట్టవద్దని గళమెత్తారు.


దేశీయ ఆవు రకాలు అంతరించిపోయేలా చేయాలనే పెద్ద కుట్రలో భాగంగానే ఎద్దులకు విత్తు కొట్టే ఆదేశం ఉందని భోపాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ ఆరోపించారు. బీజేపీ ఎంపీ వాదనతో కాంగ్రెస్ పార్టీ ఏకీభవించింది. దేశీయ ఆవుల జాతులను అంతం చేయడానికి విత్తు కొట్టే ఈ చర్య అని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సాలుజా ఆరోపించారు. స్వదేశీ పశువుల జాతులను అంతరించిపోయేలా చేయవద్దని మధ్యప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో మధ్యప్రదేశ్  ప్రభుత్వం మంగళవారం ఎద్దులకు విత్తు కొట్టే ప్రక్రియను నిలిపివేస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది.


Updated Date - 2021-10-16T18:28:20+05:30 IST