అఖిలేష్ వేసిన రోడ్డుకు యోగిని ప్రశంసిస్తూ తేజస్వీ ట్వీట్

ABN , First Publish Date - 2022-02-18T23:37:37+05:30 IST

దీపం కింద చీకటి ఉంటుందని విన్నాను. కానీ బీజేపీ వాళ్ల అజ్ణానం చూస్తే సూర్య అంటే సూర్య కింద కూడా చీకటి అని అర్థం చేసుకోవచ్చు. ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేను పొడగించేందుకు వంతెనలు నిర్మిస్తున్నారు. కానీ ఇప్పుడున్నది ‘అనుపయోగి’..

అఖిలేష్ వేసిన రోడ్డుకు యోగిని ప్రశంసిస్తూ తేజస్వీ ట్వీట్

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని పొగుడుతూ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధినేత, ఎంపీ తేజస్వీ సూర్య ఒక ట్వీట్ చేశారు. లఖ్‌నవూ-కన్నౌజ్ ఎక్స్‌ప్రెస్‌వేకు చెందిన వీడియోను తేజస్వీ షేర్ చేశారు. అనంతరం ‘‘లక్‌నవూ నుంచి కన్నౌజ్.. యోగి యొక్క ఎక్స్‌ప్రెస్‌వే’’ అనే అర్థంలో రాసుకొచ్చారు. ‘ఎక్స్‌ప్రెస్‌వే ప్రదేశ్’, ‘యూపీ హే.. యోగి హే’ అనే రెండు హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు. వాస్తవానికి ఈ రోడ్డు నిర్మించింది సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో. యోగి ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక సంవత్సరం ముందు ఈ రోడ్డును అప్పటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రారంభించారు. దీంతో తేజస్వీ యాదవ్‌పై నెటినెట్లు ట్రోల్స్ వేస్తున్నారు.


అఖిలేష్ యాదవ్ సైతం తేజస్వీ ట్వీట్‌ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ‘‘దీపం కింద చీకటి ఉంటుందని విన్నాను. కానీ బీజేపీ వాళ్ల అజ్ణానం చూస్తే సూర్య అంటే సూర్య కింద కూడా చీకటి అని అర్థం చేసుకోవచ్చు. ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వేను పొడగించేందుకు వంతెనలు నిర్మిస్తున్నారు. కానీ ఇప్పుడున్నది ‘అనుపయోగి’ (యోగిని విమర్శనాత్మకంగా ఇలా పిలుస్తుంటారు) నిర్మించలేదని తెలుసుకోవాలి. వాళ్లు నిర్మించేవి ఇప్పటికి కూడా ప్రారంభానికి నోచుకోలేదు’’ అని ట్వీట్ చేశారు.


అయితే అఖిలేష్ ట్వీట్‌ను తేజస్వీ సూర్య రీట్వీట్ చేస్తూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం నాటి నుంచి 2017 వరకు ఉత్తరప్రదేశ్‌లో కేవలం 467 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించారని, కానీ యోగి ఐదేళ్ల పాలనలో 1,321 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించారని బీజేపీ ప్రకటనను షేర్ చేశారు. ఒకవైపు తేజస్వీ తన వ్యాఖ్యల్ని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నెటిజెన్లు మాత్రం ట్రోల్స్ వేస్తూనే ఉన్నారు. బీజేపీ కొత్తగా ఏమీ చేయదని, కానీ ఎవరేం చేసినా వాళ్ల పేర్లు మార్చుకుంటుందని నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.



Updated Date - 2022-02-18T23:37:37+05:30 IST