కేసీఆర్‌ను పిలిచి జగన్‌ దావత్‌ ఇస్తే మనసు మారుతుందేమో : టీజీ

ABN , First Publish Date - 2020-10-26T21:11:44+05:30 IST

కేసీఆర్‌ను పిలిచి జగన్‌ దావత్‌ ఇవ్వాలి..

కేసీఆర్‌ను పిలిచి జగన్‌ దావత్‌ ఇస్తే మనసు మారుతుందేమో : టీజీ

ఢిల్లీ/అమరావతి : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడానికి ఇంకా ఫుల్ స్టాప్ పడనేలేదు. ఇప్పటికే పలు మార్లు ఈ వివాదంపై అధికారులు, మంత్రులు సమావేశమై చర్చించినప్పటికీ కొలిక్కిరాలేదు. ఈ వ్యవహారంపై తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత టీజీ వెంకటేష్ స్పందించారు. కృష్ణా మిగులు జలాలు రాయలసీమ తీసుకుంటే తప్పేంటి? అని టీజీ ప్రశ్నించారు. ‘కేసీఆర్‌ను పిలిచి జగన్‌ దావత్‌ ఇవ్వాలి.. అప్పుడైనా కేసీఆర్‌ మనసు మారుతుందేమో?. తెలంగాణ మిగులు జలాలు వాడుకోవచ్చు.. రాయలసీమ వాడుకోవద్దా?’ అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.


కొందరు నోరు జారుతున్నారు!

ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, మూడు రాజధానుల విషయంపై కూడా టీజీ మాట్లాడారు. మూడు రాజధానులు ఇప్పట్లో జరిగే అంశం కాదని ఆయన తేల్చిచెప్పారు. ఏపీ ఆర్ధిక సంక్షోభంలో ఉందనేది జగమెరిగిన సత్యమని తెలిపారు. కేంద్రం తెస్తున్న బిల్లులకు జగన్‌ ప్రభుత్వం సహకరిస్తోందని.. కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తున్నా కొందరు నేతలు నోరు జారుతున్నారని వెంకటేష్ మండిపడ్డారు. ప్రత్యేక హోదాను ఇంకా బూచిలా చూపుతున్నారని.. హోదా జరిగే పని కాదని మరోసారి టీజీ చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి కనీసం ప్యాకేజీ తీసుకుని రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని సీఎం జగన్‌కు టీజీ సూచించారు.


నేటికి కొలిక్కిరాలేదు..!

కాగా.. గోదావరి, కృష్ణా బేసిన్‌లో నీటి వినియోగం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ తరుణంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ తేల్చేయాలని భావించినప్పటికీ.. సమావేశంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎవరి వాదనలు వారు వినిపించారు. అనంతరం కేంద్ర మంత్రికి జగన్ లేఖ రాయడం.. కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ప్రకటన విడుదల చేయడం ఇవన్నీ జరిగాయి. నాటి నుంచి నేటికీ ఈ వివాదం కొలిక్కిరాలేదు.

Updated Date - 2020-10-26T21:11:44+05:30 IST