నగరమే.. పునాది

ABN , First Publish Date - 2022-06-30T14:59:41+05:30 IST

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు నగరం వేదిక కానుంది. భాగ్యనగరంలో బీజేపీ ప్రస్థానం ప్రత్యేకమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే భాగ్యనగరమే

నగరమే.. పునాది

ఉనికి చాటుతూ.. విజయం సాధిస్తూ..

జనసంఘ్‌ నుంచి బీజేపీ వరకు..

ఒక్క సీటు నుంచి ఎదుగుతూ.. 

పాత బస్తీ నుంచి.. నలుమూలలకూ... 

ఇదీ భాగ్యనగరంలో బీజేపీ ప్రస్థానం


హైదరాబాద్‌ సిటీ: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు నగరం వేదిక కానుంది. భాగ్యనగరంలో బీజేపీ ప్రస్థానం ప్రత్యేకమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే భాగ్యనగరమే పార్టీకి పునాది అని చెప్పవచ్చు. నాటి జనసంఘ్‌ నుంచి నేటి బీజేపీ వరకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉనికిని చాటుకుంటూనే ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఐదు స్థానాల్లో విజయం సాధించి రికార్డు సృష్టించగా, తాజాగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 47మంది కార్పొరేటర్లు విజయం సాధించి తమ సత్తా చాటారు. 


జనసంఘ్ తో తొలి అడుగులు

శ్యామప్రసాద్‌ ముఖర్జీ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ సంయుక్తంగా అక్టోబర్‌ 21 1951లో ‘భారతీయ జన సంఘ్‌’ (బీజేఎ్‌స)ను స్థాపించారు. 1967 ఎన్నికల్లో తొలిసారిగా నగరంలోని గగన్‌మహల్‌, యాకత్‌పురా, చార్మినార్‌ నియోజకవర్గాల్లో పోటీచేసిన బీజేఎస్‌ ఓటమిని చవిచూసింది. అప్పటికే బద్దం బాల్‌రెడ్డి, ఆలె నరేంద్ర, బండారు దత్తాత్రేయ తదితరులు నగరంలోని ఆర్‌ఎ్‌సఎస్‌ శాఖ కార్యకర్తలుగా గుర్తింపు పొందారు. ఎమర్జెన్సీ అనంతరం పలు పార్టీలతో కలిసి జనతాపార్టీ ఏర్పాటైంది. 1978 ఎన్నికల్లో జనతాపార్టీ అభ్యర్థులు నగరంలోని పలు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ సికింద్రాబాద్‌లో మాత్రమే గెలిచారు. అనివార్య కారణాలతో జనతాపార్టీ నుంచి జనసంఘ్‌ బయటకొచ్చింది. వాజపేయి అధ్యక్షతన 1980, ఏప్రిల్‌ 6న భారతీయ జనతా పార్టీ అంకురించింది. బీజేపీ ఏర్పాటైన తొలినాళ్లలో నగర అధ్యక్షురాలిగా మాజీ మేయర్‌ రాణి కుముదిని బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత ఆ పదవిలో బద్దం బాల్‌రెడ్డి కొలువుదీరారు.  


తొలిబోణి మలక్‌పేట

1983 సాధారణ ఎన్నికల్లో బీజేపీ నగరంలోని చాంద్రాయణగుట్ట, హిమాయత్‌నగర్‌, కార్వాన్‌, మలక్‌పేట నుంచి పోటీ చేసింది. మలక్‌పేట్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఇంద్రసేనారెడ్డి గెలుపు తో బీజేపీ భాగ్యనగరంలో తొలిబోణీ కొట్టింది. 1985 ఎన్నికల్లో కార్వాన్‌ నుంచి బద్దం బాల్‌రెడ్డి, హిమాయత్‌నగర్‌ నుంచి ఆలె నరేంద్ర విజయం సాధించారు. 1989లో కార్వాన్‌ ఒక్కటే బీజేపీకి మిగిలింది. 


టీడీపీతో దోస్తీ..

అప్పటి రాష్ట్ర రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచింది. 1985 జనరల్‌ ఎలక్షన్లలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీచేశాయి. ఆ ఎన్నికల్లో కార్వాన్‌ నుంచి బద్దం బాల్‌రెడ్డి, హిమాయత్‌నగర్‌ నుంచి ఆలె నరేంద్ర పరాజయం పాలయ్యారు. మలక్‌పేట్‌ నియోజకవర్గం నుంచి 

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుపై బీజేపీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి విజయకేతనాన్ని ఎగురేశాడు.  1986 హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 12 స్థానాల్లో బీజేపీ గెలిపొందింది.  1989ఎన్నికల్లో కార్వాన్‌ నుంచి బద్దం బాలరెడ్డి గెలిచారు. అనంతరం 1994 సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ స్వతంత్రంగా ఉమ్మడి రాష్ట్రంలోని 280 స్థానాల్లో పోటీచేసింది. అయితే, మూడు సీట్లను మాత్రమే కైవసం చేసుకోగా, అందులో రెండు స్థానాలు  కార్వాన్‌, మహరాజ్‌గంజ్‌ నగరంలో గెలుపొందినవే. 1999 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మిత్రపక్షంగా పోటీచేశాయి. ముషీరాబాద్‌ స్థానం నుంచి డా. లక్ష్మణ్‌, మలక్‌పేట్‌నుంచి ఇంద్రసేనారెడ్డి గెలుపొందారు. 2004లోనూ టీడీపీ, బీజేపీ అలయెన్స్‌ కొనసాగింది. ఆ ఎన్నికల్లో హిమాయత్‌నగర్‌ నుంచి పోటీచేసిన జి. కిషన్‌రెడ్డి విజయం సాధించారు. 


ఐదు స్థానాల్లో గెలుపు..

బీజేపీ స్వతంత్రంగా 2009లో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 271 స్థానాల్లో పోటీచేసింది.  రెండు స్థానాలలో మాత్రమే గెలుపు జెండా ఎగరేసింది. అందులో ఒకటి అంబర్‌పేట్‌ నియోజకవర్గం కావడం విశేషం. 2014 ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ మిత్రబంధం కొనసాగింది. నగరంలోని ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌, ఖైరతాబాద్‌, గోషామహల్‌, ఉప్పల్‌ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 39 ఏళ్ల భారతీయ జనతాపార్టీ చరిత్రలో భాగ్యనగరంలో ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుపొందడం అదే తొలిసారి. అవే ఎన్నికల్లో ఓ ఏంపీ స్థానంలో విజయం సాధించి, గ్రేటర్‌లో సత్తా చాటింది. తర్వాత 2018 ఎన్నికల్లో గోషామహల్‌ అసెంబ్లీ స్థానంలో రాజాసింగ్‌ గెలవగా, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నుంచి కిషన్‌రెడ్డి విజయం సాధించారు. ఆయనను కేంద్ర మంత్రి పదవి వరించింది.  


సికింద్రాబాద్‌ స్పెషల్‌

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ నాలుగు సార్లు విజయం సాధించింది.  1991 తొలిసారి బండారు దత్తాత్రేయ ఇక్కడి నుంచి ఎంపీగా విజయం సాధించారు. తర్వాత 1998, 1999, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. పలుమార్లు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో కిషన్‌రెడ్డి విజయం సాధించి కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టారు. 


గ్రేటర్‌ కార్పొరేషన్‌లోనూ హవా

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది.  మొదటిసారి పోటీ చేసిన సమయంలో నాలుగు డివిజన్లు మాత్రమే గెలిచిన పార్టీ తాజా ఎన్నికల్లో ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించింది.


దళిత కార్యకర్త ఇంటికి అగ్రనేత 

తెలంగాణలో బీజేపీ కార్యకర్తలకు జాతీయ నాయకత్వం అండగా ఉంటుందని ఆపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి బై జయంత్‌ జై పాండా తెలిపారు. మాదాపూర్‌లో బీజేపీ దళిత కార్యకర్త యాదయ్య నివాసానికి బుధవారం రాత్రి చేరుకున్న బై జయంత్‌ అతని ఇంట్లో భోజనం చేశారు. అక్కడే బస చేశారు.  

Updated Date - 2022-06-30T14:59:41+05:30 IST