30న మదురైకి నడ్డా

ABN , First Publish Date - 2021-01-22T13:50:37+05:30 IST

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జాతీయ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఇటీవల చెన్నై వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరోమారు రాష్ట్ర పర్యటనకు

30న మదురైకి నడ్డా

చెన్నై (ఆంధ్రజ్యోతి): త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జాతీయ నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఇటీవల చెన్నై వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరోమారు రాష్ట్ర పర్యటనకు వస్తూ ఈనెల 30వ తేదీన మదురై రానున్నారు. అక్కడ దక్షిణవిభాగ నేతలతోనూ, కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు. పార్టీ విజయంపై వ్యూహరచన చేయను న్నారు. అంతకు ముందుగా ఈనెల 29వ తేదీన కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి వెళ్లి అక్కడి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరునాడు మదురై చేరుకుంటారు. ఇందుకోసం బీజేపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేపట్టాయి. 

అళగిరిని కలుస్తారా? : డీఎంకే బహిష్కృత నేత, కేంద్ర మాజీ మంత్రి అళగిరి కొత్త పార్టీ పెట్టాలా? ఏదైనా పార్టీలో చేరాలా అన్నదానిపై తర్జనభర్జన పడుతున్న సమయంలో జేపీ నడ్డా మదురై వస్తుండడం చర్చనీయాంశమైంది. మదురై చుట్టుపక్కల జిల్లాల్లో అళగిరికి తిరుగులేని పట్టుంది. అందుకే ఆయనకు గతంలో డీఎంకే దక్షిణవిభాగ కార్యదర్శిగా పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన భవిష్యత్తు కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఇటీవల అళగిరి ప్రకటించారు. ఇప్పటి వరకూ ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించకపోయినప్పటికీ ఈ నెలాఖరులోగా ఏదో ఒకటి తేల్చేస్తారని   సన్నిహితులు చెబుతున్నారు. అయితే తమ పార్టీలోకి చేరాలంటూ ఇప్పటికే బీజేపీ నేతలు అళగిరిని పలుమార్లు సంప్రదించారు. ఇలాంటి సమయంలో జేపీ నడ్డా అళగిరి నివాస ప్రాంతమైన మదురై వస్తుండడంతో వీరి భేటీ వుంటుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. మంచిపట్టున్న నేత కావడంతో అళగిరి ఇంటికి వెళ్లే పార్టీలోకి ఆహ్వానించాలని జేపీ నడ్డా భావించి వుండవచ్చని డీఎంకేకు చెందిన ఓ నేత వ్యాఖ్యానించగా, అలాంటిదేమీ లేదని బీజేపీ వర్గాలు నర్మగర్భంగా వ్యాఖ్యానించాయి. 

Updated Date - 2021-01-22T13:50:37+05:30 IST