చేరికలపై బీజేపీ నజర్‌

ABN , First Publish Date - 2021-02-25T05:56:04+05:30 IST

నాగార్జునసాగర్‌పై బీజేపీ కేంద్ర, రాష్ట్ర శాఖలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఎలాగైనా గెలిచి, రాష్ట్రంలో విజయ పరంపర కొనసాగించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాయి.

చేరికలపై బీజేపీ నజర్‌

నేడు హాలియాలో బహిరంగసభ

హాజరుకానున్న పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌, ఎమ్మెల్యే రఘనందన్‌రావు 

నాగార్జునసాగర్‌లో అభ్యర్థిత్వంపై స్పష్టత కరువు

కమలంలో కలహాలు, నివేదిత పాదయాత్రకు బ్రేక్‌ ?



నాగార్జునసాగర్‌పై బీజేపీ కేంద్ర, రాష్ట్ర శాఖలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఎలాగైనా గెలిచి, రాష్ట్రంలో విజయ పరంపర కొనసాగించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే నియోజకవర్గానికి ఇద్దరు ఇన్‌చార్జిలను రాష్ట్రశాఖ నియమించింది. వారు నియోజకవర్గమంతా తిరుగుతూ పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వైరి పార్టీల నుంచి ఎంత మంది వస్తున్నారోననే సమాచారం సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు కమలంలో అంతర్గత కలహాలు తలనొప్పిగా మారాయి. ఆ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆశావహులు ఎవరికివారు ప్రచారం చేసుకుంటూపోతున్నారు. కేంద్ర నాయకత్వం సూచనల మేరకు నేడు హాలియాలో జరిగే బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు హాజరుకానున్నారు. 


నల్లగొండ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వరుస విజయాలతో ఉత్సాహంతో ఉన్న బీజేపీ నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలోనూ ఆ పరంపర కొనసాగించాలని యోచిస్తోంది. ఇందుకు ఢిల్లీ నుంచి సాగర్‌ నియోజకవర్గ గల్లీవరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. స్థానికంగా పార్టీ బలం అంతంత మాత్రమే అని గ్రహించిన కమలం పెద్దలు అందరికంటే ముందే ఇన్‌చార్జిలను నియమించారు. పార్టీ, సంఘ్‌ ఇతర అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు స్థానికంగా చాపకింద నీరులా పని చేసుకుపోతున్నారు. ఎదుటి పక్షాల బలాల నేపథ్యంలో బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించే పరిస్థితి లేదు, బలమైన అభ్యర్థి కోసం ఇంకా వేట కొనసాగిస్తూనే ఉంది. పార్టీలో స్థానికంగా టికెట్‌ ఆశిస్తూ పనిచేస్తున్న వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. నేతలను గాడిలో పెట్టేందుకు పలుమార్లు సూచనలు చేసినా ఫలితంలేదు. నివేదితారెడ్డి ఏకంగా పాదయాత్ర చేపట్టగా, సరిగ్గా రెండు రోజులకే ఆమె తన కార్యక్రమాన్ని నిలిపేయడం అసమ్మతికి అద్దంపడుతోంది.


కమలంలో కలహాలు

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కంకణాల శ్రీధర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే విభేదాలు మొదలయ్యాయి. ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా మాజీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి నాయకత్వంలో నల్లగొండ పట్టణానికి సమీపంలోని దర్వేశిపురంలో అసమ్మతి నేతల సభ నిర్వహించారు. ఆ తర్వాత అసమ్మతి నేతలంతా కలిసి హైదరాబాద్‌లో బండి సంజయ్‌ని కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికీ శ్రీధర్‌రెడ్డి ఎక్కువ భాగం జిల్లా కేంద్రానికి దూరంగానే ఉంటున్నారు. నోముల హఠాన్మరణంతో సాగర్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గతంలో పోటీచేసిన కంకణాల నివేదిత సాగర్‌ కేంద్రంగానే పనిచేయడం ప్రారంభించారు. గతంలో కంకణాల శ్రీధర్‌రెడ్డి సాధించిన ఓట్లు, స్థానిక నాయకత్వం ఏకీభవించకపోవడం వంటి కారణాలకు తోడు కడారు అంజయ్య యాదవ్‌లాంటి వారు పార్టీలో చేరడంతో అసమ్మతి పెరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రిక్కల ఇంద్రసేనారెడ్డి కాషాయం కండువా కప్పుకోవడంతో మూడు గ్రూపులుగా పని ప్రారంభమైంది. కడారు అంజయ్య నియోజకవర్గంలో బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన వారు కావడం, గతంలో టీడీపీ నుంచి పోటీచేసిన క్రమంలో సుమారు 30వేల ఓట్లు సాధించారు. రిక్కల కుటుంబం జానారెడ్డికి ప్రధాన అనుచరులుగా ఉండేవారు, హాలియా మునిసిపల్‌ కేంద్రంలో పట్టున్నవారు. ముందునుంచి ప్రచారంలో ఉన్న కంకణాల కుటుంబం వేగం పెంచింది, కేంద్ర మంత్రితో ఓ బహిరంగ సభను నిర్వహించింది. ప్రత్యేకంగా రథాలు, పాటలు, కళాకారులు, సోషల్‌ మీడియాలో ప్రచారం పెంచగా తనకు అవకాశం ఇవ్వాలంటూ బయోడేటాతో కడారు పార్టీ కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 


సాగర్‌కు ఇద్దరు ఇన్‌చార్జిలు

ఆశావాహులు ఎవరికి వారు ప్రచారం చేసుకుంటుండడంతో క్యాడర్‌ గందరగోళానికి గురవడంతో పార్టీ కేంద్ర, రాష్ట్ర శాఖలు ఇద్దరు ఇన్‌చార్జిలను నియమించింది. మాజీ ఎంపీ చాడ సురే్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత సంకినేని వెంకటేశ్వరరావులను ఇన్‌చార్జిలుగా నియమించింది. ఇన్‌చార్జిలు వెంటనే రంగంలోకి దిగి, పలుమార్లు అంతర్గత సమావేశాలు నిర్వహించారు. పోలింగ్‌ బూత్‌లు, మండలాలవారీగా ఇన్‌చార్జిలను నియమించి ఈనెల మొదటి నుంచే వారిని పనిలో పెట్టారు. గందరగోళానికి తెరతీయాలన్న ఆలోచనతో, పార్టీని గెలిపించాలి అనే నినాదంతో ఏ కార్యక్రమానికైనా ముగ్గురు కలిసే వెళ్లాలని ఇన్‌చార్జిలు సూచించారు. ఆ సూచనలు బేఖాతరు చేస్తూ కంకణాల దంపతులు తమదైన శైలిలో ఒంటరిగానే ప్రచారం చేసుకుంటున్నారు.


అభ్యర్థిత్వంపై స్పష్టత కరువు

ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, టీడీపీ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ మాత్రం తన అభ్యర్థి ఎవరనేది అధికారికంగా తేల్చుకోలేకపోతోంది. విజయ పరంపర కొనసాగాలంటే ఇప్పుడు ఉన్న ముగ్గురికంటే బలమైన అభ్యర్థి కావాలంటూ వేట కొనసాగిస్తోంది. టీఆర్‌ఎస్‌ కీలక నేతలను ఇప్పటికే సంప్రదించగా వారు విముఖతను వ్యక్తంచేశారు. నటి విజయశాంతిని బరిలో దించితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసినట్లు సమాచారం. ఇద్దరు ఇన్‌చార్జిలు విస్తృతంగా పర్యటిస్తూ పెద్దసంఖ్యలో ఇన్‌చార్జిల నియామకం, ప్రచారం, చేరికలతో మొదట 10శాతంగా ఉన్న పార్టీ ఓటింగ్‌ బలం 16 శాతానికి పెరిగినట్లు తెలిసింది. ఓ వైపు గెలుపు గుర్రాలను వెతుకుతూనే మరోవైపు చేరికలపై నజర్‌పెట్టారు. ఈ క్రమంలోనే పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌, దుబ్బాక ఎమ్మెల్యేలతో సభ ఏర్పాటుచేశారు. నియోజకవర్గంలో కడారు అంజయ్య అనుచరులు, ఇంద్రసేనారెడ్డి అనుచరులు గురువారం పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి త్రిపురారం జడ్పీటీసీకి పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్‌ రవి నాయక్‌ కాషాయం కండువా కప్పుకోనున్నారు.

Updated Date - 2021-02-25T05:56:04+05:30 IST