‘వడ్లను రాష్ట్రప్రభుత్వమే కొనాలి’

ABN , First Publish Date - 2021-11-26T05:44:22+05:30 IST

‘వడ్లను రాష్ట్రప్రభుత్వమే కొనాలి’

‘వడ్లను రాష్ట్రప్రభుత్వమే కొనాలి’
కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రాన్ని అందిస్తున్న జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి

- జనగామలో బీజేపీ, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా

జనగామ కల్చరల్‌, నవంబరు 25 : ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ డిమాండ్‌ చేస్తున్న నిరసనలకు రైతులకు పలు పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ జన జాగరణ యాత్ర పేరుతో జనగామ కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రం అందించగా, బీజేపీ ఆధ్వర్యంలో జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధర్నా నిర్వహించారు.

జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో..

ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు వేయాలని జనగామ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో జంగా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్‌కు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్వింటా ధాన్యానికి రూ.2500 చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఐకేపీ, సహకార సంఘాల ద్వారా 6,772 కొనుగోలు కేంద్రాలు తెరవాల్సి ఉం డగా కేవలం 4,743 కేంద్రాలు పేరుకు మాత్రమే ఓపెన్‌ చేశారన్నారు. ఇందులో సగం కూడా కొనుగోళ్లు చేయడం లేదన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేసి ధాన్యం రైతులకు భరోసా కల్పించాలని, మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తుందన్నారు.

నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో..

టీపీసీసీ పిలుపు మేరకు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ య్య ఆదేశాల మేరకు ప్రజాచైతన్య జనజాగరణ యాత్రలో భాగంగా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కొన్నె మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు మాసాన్‌పల్లి లింగాజీ, బడికె ఇందిర, ఉడుత రవియాదవ్‌, వేమళ్ల రాజిరెడ్డి, వంచ వెంకట్‌రెడ్డి, పిట్టల సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా..

ధాన్యాన్ని మార్కెట్‌కు తెచ్చి రెండునెలలు గడుస్తున్నా కొనుగోలు చేయడంలో రాష్ట్రప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డును సందర్శించి సెక్రటరీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్‌కు వచ్చిన ధాన్యా న్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలన్నారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామన్నారు. నాయకులు సిరికొండ విద్యాసాగర్‌రెడ్డి, ఉడుగుల రమేష్‌, సౌడ రమేష్‌, శివరాజ్‌ యాదవ్‌, సోమిడి వెంకట్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, దేవరాయ ఎల్లయ్య, తిరుపతియాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-26T05:44:22+05:30 IST