Bjp కార్యాలయంపై పెట్రో బాంబు దాడి

ABN , First Publish Date - 2022-02-11T14:12:33+05:30 IST

మున్సిలల్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ‘కమలాలయం’ పై పెట్రోల్‌ బాంబుల దాడి జరిగింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. కాగా ఈ ఘటనకు పాల్పడిన

Bjp కార్యాలయంపై పెట్రో బాంబు దాడి

- కేంద్రమంత్రి మురుగన్‌ సహా నేతల ఖండన

- అన్ని పార్టీల కార్యాలయాలకు భద్రత పెంపు


చెన్నై: మున్సిలల్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ‘కమలాలయం’ పై పెట్రోల్‌ బాంబుల దాడి జరిగింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. కాగా ఈ ఘటనకు పాల్పడిన మాజీ రౌడీ కరుక్కా వినోద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనను పలువురు నేతలు ఖండించగా, రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల కార్యాలయాల వద్ద భద్రత పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


అర్ధరాత్రి దాటాక..

గురువారం వేకువజాము 1.30 గంటల ప్రాంతంలో బైకుపై ఆ కార్యాలయం వద్దకు వచ్చిన ఓ యువకుడు మూడు పెట్రోల్‌ బాంబులు విసిరి పరారయ్యాడు. ఆ బాంబులు కార్యాలయ ప్రాంగణంలో పెద్ద శబ్దంతో పేలాయి. ఈ సంఘటనలో కార్యాలయం గోడ, నేలపె టైల్స్‌ దెబ్బతిన్నాయి. ఆ సమయంలో అక్కడే వున్న పోలీసులు ఆ యువకుడిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. పెట్రోల్‌ బాంబులు పేలిన శబ్దం విని కార్యాలయం చుట్టూ ఇళ్ళలో ఉన్న ప్రజలు ఉలిక్కి పడి లేచి అక్కడికి చేరుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న బీజేపీ చెన్నై ఎన్నికల ఇన్‌చార్జ్‌ కరాటే త్యాగరాజన్‌, ఇతర నాయకులు, ప్రముఖులు కార్యాలయానికి హుటాహుటిన చేరుకున్నారు. పోలీసులు కూడా వెళ్ళారు. వేలిముద్రల నిపుణుల రప్పించి బాంబులు పడిన ప్రాంతాల్లో పరిశీలించి, అనంతరం సబ్బు నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఈ ఘటనకు నిరసనగా గురువారం ఉదయం కార్యాలయం వద్ద బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. 


సీసీ కెమెరాకు చిక్కిన రౌడీ...

ఈ సంఘటనపై విచారణ ప్రారంభిచిఇన పోలీసులు ఆ కార్యాలయం వద్దనున్న సీసీ కెమెరాల్లో నమోదైన వీడియో దృశ్యాలను పరిశీలించారు. వాటి ఆధారాలతో పోలీసులు నగరంలోని పాత నేరస్తుల ఫొటోలతో పోల్చి చూశారు. చివరకు బీజేపీ కార్యాలయంపై పెట్రోలు బాంబులు విసిరింది తేనాంపేటకు చెందిన పాత రౌడీ కరుక్కా వినోద్‌గా గుర్తించారు. ఆ తర్వాత అతడి ఆచూకీ కోసం నగరమంతా గాలించి, అదుపులోకి తీసుకున్నారు.


నీట్‌ రద్దును వ్యతిరేకించడం వల్లే...

అరెస్టయిన కరుక్కా వినోద్‌పై నగరంలోని పలు స్టేషన్లలో పది కేసులు నమోదై ఉన్నాయి. వాటిలో హత్యకేసులు, హత్యాయత్నం కేసులు, రెండు బాంబు దాడి కేసులు కూడా ఉన్నాయి. నీట్‌ రద్దును బీజేపీ వ్యతిరేకించడం వల్లే తాను ఆ పార్టీ కార్యాలయంపై పెట్రోల్‌ బాంబులు విసిరినట్లు వినోద్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. అయితే పోలీసులు అతని మాటల్ని విశ్వసించడం లేదు. మరికొన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. వినోద్‌ గతంలో గూండా చట్టం కింద కూడా అరెస్టయ్యాడని పోలీసులు విచారణలో వెల్లడైంది.


మురుగన్‌ ఖండన...

ఈ ఘటనను బీజేపీకి చెందిన కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌ తీవ్రంగా ఖండించారు. పార్టీకి ప్రధానాలయమైన కమలాలయంపై బాంబుదాడి జరగటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. దీనికి బాధ్యులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనవల్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు కలత చెందకూడదని, ఎన్నికలల్లో గెలిచేందుకు పాటుపడాలని మురుగన్‌ ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. 


ఎన్‌ఐఏ విచారణ జరపాలి : అన్నామలై

కమలాలయంపై జరిగిన పెట్రోల్‌ బాంబుల దాడి సంఘటపై జాతీయ దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డిమాండ్‌ చేశారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పెట్రోల్‌ బాంబుల దాడికి సంబంధించి అసలైన కారణాలు, నిజమైన దోషులను గుర్తించాల్సి ఉందన్నారు. ఈ సంఘ టనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకముందే పెట్రోల్‌ బాంబులు పడిన స్థలాన్ని పోలీసులు ఎందుకు శుభ్రం చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నీట్‌కు బీజేపీ మద్దతు ప్రకటించడం వల్లే ఈ బాంబుదాడి జరిగిదంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అరెస్టయిన యువకుడు పాత రౌడీ అని, అతడికి నీట్‌ గురించి ఏం తెలుస్తుందని అన్నామలై ప్రశ్నించారు. తన ఫోన్‌ను ఇంటెలిజెన్స్‌ విభాగం ట్యాపింగ్‌ చేస్తోందని చెప్పారు. అరెస్టయిన పాత రౌడీ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు జరుపకూడదని చెప్పారు.


డీఎంకేపై అనుమానం: కరాటే త్యాగరాజన్‌

బీజేపీ చెన్నై ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉన్న కరాటే త్యాగరాజన్‌ పెట్రోల్‌ బాంబు దాడి వెనుక అధికార డీఎంకే పరోక్ష హస్తం ఉందని ఆరోపించారు. 15 యేళ క్రితం ఇదే విధంగా జరిగిన సంఘటనలో డీఎంకే ప్రమేయం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఈ సంఘటనపై తాము డీఎంకే ప్రభుత్వాన్నే తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.  ఇదే రీతిలో ఈ సంఘటనను ఖండిస్తూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, టీఎంసీ నేత జీకే వాసన్‌ ప్రకటనలు జారీ చేశారు.



Updated Date - 2022-02-11T14:12:33+05:30 IST