మెగా ఈవెంట్‌గా యోగి ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2022-03-21T21:50:21+05:30 IST

రెండోసారి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నభూతో నభవిష్యతి అనే విధంగా..

మెగా ఈవెంట్‌గా యోగి ప్రమాణస్వీకారం

లక్నో: రెండోసారి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నభూతో నభవిష్యతి అనే విధంగా మెగా ఈవెంట్‌గా నిర్వహించాలని బీజేపీ యోచన చేస్తోంది. ఈనెల 25న లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగే  ఈ కార్యక్రమంలో 45,000 మందికి పైగా ప్రజలను ఆహ్వానించనుంది. దీనికి రెండ్రోజుల ముందే... ఈనెల 23న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లక్నో చేరుకుంటారు.


యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దిగ్గజ నేతలు పాల్గోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరుకానున్నారు. వీరితో పాటు యూపీ మాజీ మంత్రులు ములాయం సింగ్ యాదవ్, మాయావతి, అఖిలేష్‌లకు కూడా ఆహ్వానాలు పంపారు. యూపీలోని మొత్తం 75 జిల్లాల కార్యకర్తలకు బీజేపీ ఆహ్వానాలు పంపింది. కార్యకర్తల జాబితాను సిద్ధం చేసి, నాయకత్వానికి తెలియజేయాలని పార్టీ జిల్లా యూనిట్ల అధ్యక్షులను బీజేపీ కోరింది. కార్యకర్తలందరికీ రవాణా సౌకర్యం కల్పించాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించింది. కార్యకర్తలు సొంతంగా కూడా లక్నోకు చేరుకోవచ్చు. అయితే, అలాంటి వారు తమ ప్రయాణానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా తమతమ వాహనాలపై బీజేపీ జెండాలని ఉంచుకోవాలని సూచించింది.


23న లక్నోకు అమిత్‌షా...24న లెజిస్లేచర్ పార్టీ సమావేశం

యూపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి అమిత్‌షా ఈనెల 23న లక్నో చేరుకోనున్నారు. యూపీలో బీజేపీ ఘనవిజయం తర్వాత అమిత్‌షా లక్నోకు రానుండటం ఇదే ప్రథమం. లాంఛనప్రాయంగా యోగి ఆదిత్యనాథ్‌ను తమ నేతగా ఎన్నుకునేందుకు 24న లెజిస్లేచర్ పార్టీ సమావేశమవుతుంది. 25న ప్రమాణస్వీకారం ఉంటుంది. యూపీలో ఒక రాజకీయ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం దశాబ్దాల కాలంలో ఇదే ప్రథమం. బీజేపీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 403 సీట్లలో 255 స్థానాలు గెలుచుకుని సొంతంగానే పూర్తి మెజారిటీ సాధించింది.

Updated Date - 2022-03-21T21:50:21+05:30 IST