బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరం

ABN , First Publish Date - 2022-09-28T05:44:35+05:30 IST

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలు దేశానికి ప్రమాదకరమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ అన్నారు.

బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరం
మాట్లాడుతున్నసీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్‌

కల్లూరు, సెప్టెంబరు 27: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలు దేశానికి ప్రమాదకరమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో దేశ రక్షణ భేరి యాత్ర చేపట్టి మంగళవారం కల్లూరు అర్బన్‌లోని చెన్నమ్మ సర్కిల్‌లో బహిరంగ సభ నిర్వహించారు. సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ సాయిబాబా అధ్యక్షతన చేపట్టిన సభకు గపూర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల పాల్గొన్నారు. ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో దేశానికి ఒక్క మేలు కూడా జరగలేదన్నారు. దేశంలో మత తత్వంతో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య ఐక్యతను చీలుస్తున్న బీజేపీని గద్దె దించాలని, దేశాన్ని బీజేపీ నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు వారి అకౌంట్‌కు జమ చేస్తానని అధికారంలోకి వచ్చారని, హామీల అమలులో విఫలమయ్యారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీని అమలు చేయలేకపోయారన్నారు. నిత్యావసర ధరలు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మోదీ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతోందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్‌ఐసీ, బ్యాంకులు, పోస్టల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, విద్యుత్‌ రంగాలను ప్రైవేట్‌ చేస్తున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తగదని, ప్రజా సమస్యలపై పోరు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, పార్టీ నాయకులు సుధాకరప్ప, నరసింహులు, ఎం.గోపాల్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T05:44:35+05:30 IST