భాగ్యలక్ష్మి ఆలయం పేరిట బీజేపీది రాజకీయం

ABN , First Publish Date - 2022-07-03T09:49:20+05:30 IST

కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ నేతలు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా రాజకీయం కోసమే చార్మినార్‌ భాగ్యలక్ష్మి మందిరానికి వెళుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి ఆరోపించారు. దేవుణ్ని

భాగ్యలక్ష్మి ఆలయం పేరిట బీజేపీది రాజకీయం

  • ఆ పార్టీ నేతల దర్శనం అందుకే
  • నేడు నేనూ మందిరాని వెళ్తా 
  • బీజేపీ నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటా 
  • టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి

 

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ నేతలు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా రాజకీయం కోసమే చార్మినార్‌ భాగ్యలక్ష్మి మందిరానికి వెళుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి ఆరోపించారు. దేవుణ్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మి ఆలయం పేరు చెప్పి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్లు అడిగిన బీజేపీ నేతలు కొన్ని సీట్లు గెలిచారన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాఽథ్‌ ఆదివారం భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తారని చెబుతున్నారని, అమ్మవారి దర్శనానికి వెళితే అభ్యంతరం ఎవరికీ ఉండదని, కానీ రాజకీయం చేయాలని చూడటం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్‌ మిత్రులతో కలిసి తాను కూడా ఆదివారం ఉదయం 9 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయానికి దర్శనం కోసం వెళ్తానని ప్రకటించారు. దర్శనం తర్వాత మూడు గంటల పాటు అక్కడే ఉండి బీజేపీ నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని, మంచి పాలన అందించేలా చూడాలని అమ్మవారిని ప్రార్థిస్తూ భజన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని మొక్కుకోవడానికే బీజేపీ వాళ్లు భాగ్యలక్ష్మి ఆలయానికి వెళుతున్నారన్నా రని ఆయన ఆరోపించారు. 


‘అగ్నిపథ్‌’ రద్దుపై తీర్మానం చేయాలి 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ప్రధాని మోదీ సహా కేబినెట్‌ మొత్తం ఇక్కడే ఉన్నందున అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేయాలని జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు దీనికి సమాధానం చెప్పాలన్నారు. సైన్యంలో చేరాలనే ఆసక్తి ఉన్న యువకులు అగ్నిపథ్‌ను తీసుకురావడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో అరెస్టు అయిన యువకులపై కేసులు ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గిస్తూ మరో  తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. గడిచిన రెండేళ్లుగా పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారని, దీనికి బండి సంజయ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉందని, అలాంటప్పుడు పాదయాత్రలు చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. బీజేపీ డ్రామాల కంపెనీగా మారిపోయింద ని ఆయన విమర్శించారు. 

Updated Date - 2022-07-03T09:49:20+05:30 IST