
న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ (BJP) సన్నాహాలు చేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిని ఎదుర్కొన్న నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు త్వరలో పర్యటించబోతున్నారు. ఈ నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలను, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను వీరు కలవబోతున్నారు. నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఎనిమిదో వార్షికోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది.
బీజేపీ (BJP) ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులతో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పాల్గొన్నారు. బూత్ స్ట్రెంగ్తెనింగ్ కాంపెయిన్లో భాగంగా మే 25 నుంచి జూలై 31 వరకు నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ ఎంపీలను అధిష్ఠానం కోరింది. ఒక్కొక్క ఎంపీ 30 మంది పార్టీ కార్యకర్తల కార్యకలాపాలను పర్యవేక్షించాలని కోరింది. ఒక్కొక్క ఎమ్మెల్యే 25 బూత్‌లలో కార్యకర్తల కార్యకలాపాలను పర్యవేక్షించాలని తెలిపింది. మొత్తం మీద 77,800 బూత్‌లు పార్టీ పరంగా పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఏ రాష్ట్రంలో పార్టీని పెద్ద ఎత్తున విస్తరించాలని ప్రయత్నిస్తున్నారో, ఆ రాష్ట్రంలో భారీ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ బాధ్యతలను నలుగురు నేతల బృందం చేపడుతుంది.
ఇవి కూడా చదవండి