కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-01-20T05:15:59+05:30 IST

రాష్ట్రంలో రోజు రోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా యని, కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని బీజేపీ నెల్లూరు పార్ల మెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు జీ భరత్‌కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు.

కొవిడ్‌ నియంత్రణలో ప్రభుత్వం విఫలం
మాట్లాడుతున్న బీజేపీ నాయకులు

మంత్రి కొడాలి నానీని భర్తరఫ్‌ చేయాలి : బీజేపీ


నెల్లూరు(క్రైం), జనవరి 19: రాష్ట్రంలో రోజు రోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా యని, కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని బీజేపీ నెల్లూరు పార్ల మెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు జీ భరత్‌కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులే కొవిడ్‌ నిబంధనలు పాటించక పోవడంతో కరోనా విజృంభిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తే మన రాష్ట్రంలో మాత్రం విద్యార్థులకు కరోనా రాదంటూ మంత్రులు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే విద్యాసంస్థలకు సెలవులివ్వాలని డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్యను తగ్గిస్తూ కొవిడ్‌ ప్రభావం ఎక్కువగా లేదని చూపించే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. మంత్రి కన్వెన్షన్‌ హాల్లోనే జూదాలు నిర్వహించడం రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూడలేదని, మంత్రి కొడాలి నానీని వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులో పోలీస్‌ స్టేషన్‌పై దాడి, బీజేపీ నాయకులపై దాడులను నిరసిస్తూ ఈ నెల 22వ తేదీ కర్నూలు జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. నమామి గంగే రాష్ట్ర ప్రముఖ్‌ మిడతల రమేష్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని, దానికి తోడు కరోనా విజృంభణ భయాందోళనకు గురిచేస్తోందన్నారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే, జిల్లాలో వర్షాలు కరుస్తున్నందున రైతులకు పంట నష్టం కలిగితే రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరకే పంట కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథరాజు, నారాయణరెడ్డి, ఈశ్వరయ్య,  శ్రీనివాసులు, గడ్డం విజయ, వంశీధర్‌రెడ్డి, గిరికుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-20T05:15:59+05:30 IST