వర్చువల్ ర్యాలీలకు మేము సిద్ధం: బీజేపీ

ABN , First Publish Date - 2021-12-30T00:07:42+05:30 IST

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ వేరియంట్ ఒమైక్రాన్ భయాలు, కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ..

వర్చువల్ ర్యాలీలకు మేము సిద్ధం: బీజేపీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ వేరియంట్ ఒమైక్రాన్ భయాలు, కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో వర్చువల్ ఎన్నికల ర్యాలీలకు బీజేపీ సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు తాము సిద్ధమేనని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో మంత్రి తాజా వ్యాఖ్యలు చేశారు.


''ఎన్నికల ర్యాలీల విషయంలో వర్చువల్ ర్యాలీలకు మేము సిద్ధమే. దానిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ మార్గదర్శకాలను మేము పాటిస్తాం'' అని షెకావత్ తెలిపారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల సమయంలోనూ తాము వర్చువల్ ర్యాలీలు నిర్వహించినట్టు ఆయన చెప్పారు. బీజేపీ పంజాబ్ యూనిట్ ఇన్‌చార్జిగా కూడా షెకావత్ ఉన్నారు.


మరోవైపు, ఉత్తర ప్రదేశ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో జాప్యం వద్దని భారత ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశాయి. కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తూనే ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన పార్టీల ప్రతినిధులు లక్నోలో పర్యటిస్తున్న ఈసీ టీమ్‌ను కలిసి తమ అభిప్రాయాలను తెలియజేశారు.

Updated Date - 2021-12-30T00:07:42+05:30 IST