Komatireddy Rajagopal Reddy: ముందుకే వెళ్తున్నా: రాజగోపాల్రెడ్డి

ABN , First Publish Date - 2022-07-30T02:59:28+05:30 IST

మునుగోడు వేదికగా ముందుకు వెళ్తున్నానని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ప్రకటించారు.

Komatireddy Rajagopal Reddy: ముందుకే వెళ్తున్నా: రాజగోపాల్రెడ్డి

హైదరాబాద్: మునుగోడు వేదికగా ముందుకు వెళ్తున్నానని ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ప్రకటించారు. ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తాను వేస్తున్న అడుగులో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు దిశగా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా... వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ (BJP), కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలు ఎవరి కోణంలో వారు చూస్తున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ దూకుడును ప్రదర్శిస్తుండగా కాంగ్రెస్‌ వేచిచూసే ధోరణిలో ఉంది. పార్టీ మార్పుపై స్పష్టతతో ఉన్నా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా (resignation), పోటీపై రాజగోపాల్‌రెడ్డి డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాను ఎన్నటికీ మునుగోడును వదిలి వెళ్లనని ప్రకటించిన ఆయన.. కార్యకర్తలను కాపాడుకునేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బీజేపీకి ఏ మాత్రం పట్టులేదు. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో కదలిక తెచ్చేందుకు వ్యూహాత్మకంగానే రాజగోపాల్‌రెడ్డిని బీజేపీ ఎంచుకుందన్న ప్రచారం జరుగుతోంది. 


ఉప ఎన్నిక ఖాయమని టీఆర్‌ఎస్‌ అధిష్టానం స్పష్టమైన సంకేతాలు ఇస్తుండడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు మార్గాలు వెతుక్కుంటున్నారు. సర్వేల్లో తమ పేర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టుకునేందుకు యత్నిస్తున్నారు. రాత్రివేళ విందు సమావేశాలు జోరుగా నడుపుతున్నారు. ఉప ఎన్నిక వస్తే దళితబంధు, ఆసరా పెన్షన్‌, రోడ్లు వంటివి పెద్ద సంఖ్యలో మంజూరు కావడమే కాకుండా ఓటుకు పెద్ద సంఖ్యలో రేటు పలికే అవకాశం ఉంటుందని కుల సంఘాలు నేతలు, ఓటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు జోరుగా చర్చించుకుంటున్నారు. 

Updated Date - 2022-07-30T02:59:28+05:30 IST