బీజేపీ సర్పంచ్ దంపతులను కాల్చిచంపిన ఉగ్రవాదులు

ABN , First Publish Date - 2021-08-10T00:46:28+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీ సర్పంచ్..

బీజేపీ సర్పంచ్ దంపతులను కాల్చిచంపిన ఉగ్రవాదులు

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీ సర్పంచ్ గులాం రసూల్ డర్‌, అతని భార్యను సోమవారంనాడు కాల్చిచంపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూసినట్టు జమ్మూకశ్మీర్ బీజేపీ నేత అల్టాఫ్ ఠాకూర్ ధ్రువీకరించారు. ఉగ్రవాదుల దుశ్చర్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. హింసకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతామని అన్నారు.


''సర్పంచ్ రసూల్ డర్, ఆయన భార్య జవ్‌హరా బానూపై కుల్గావ్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పిరికివాళ్ల చర్య. హింసను రెచ్చకొట్టేందుకు ప్రయత్నించిన వారిని చట్టం ముందు నిలబెడతాం. రసూల్ డర్ కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను'' అని మనోజ్ సిన్హా అన్నారు. అమాయక ప్రజలపై దాడి, చంపడం చూస్తే ఉగ్రవాదులు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టు అవగతమవుతుందని, ఇది పిరికివాళ్ల చర్య అని బీజేపీ నేత అల్టాఫ్ ఠాకూర్ పేర్కొన్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన ఆగస్టు 5న భారత జాతీయ పతాకాన్ని రసూల్ డర్ ఎగురవేసినట్టు బీజేపీ జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా తెలిపారు. ఉగ్రవాదుల దుశ్చర్యను జేకేపీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సైతం ఖండించారు.

Updated Date - 2021-08-10T00:46:28+05:30 IST