BJP State Committee: నూతన సారథి కోసం అన్వేషణ

ABN , First Publish Date - 2022-08-10T18:31:12+05:30 IST

రానున్న శాసనసభ ఎన్నికలను(Legislative Assembly Elections) దృష్టిలో ఉంచుకుని హిందుత్వ కార్డును బలంగా ప్రయోగించగల నేత కోసం బీజేపీ

BJP State Committee: నూతన సారథి కోసం అన్వేషణ

- మరోమారు కటీల్‌కు చాన్స్‌ లేనట్టే 

- రేసులో శోభాకరంద్లాజే, సీటీ రవి, సునిల్‌కుమార్‌  

- యడియూరప్ప పాత్రే కీలకం 


బెంగళూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రానున్న శాసనసభ ఎన్నికలను(Legislative Assembly Elections) దృష్టిలో ఉంచుకుని హిందుత్వ కార్డును బలంగా ప్రయోగించగల నేత కోసం బీజేపీ అన్వేషిస్తోంది. బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. మూడేళ్లుగా ఈ పదవిలో ఆయన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోమారు కటీల్‌కు చాన్స్‌ లేనట్టేనని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల బెంగళూరు(Bangalore) పర్యటన సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా ప్రత్యేకంగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పతో సమావేశమయ్యారు. ఆయన సూచించేవారికే అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టాలని కమలనాథులు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. తాను సూచించిన వారికే అధ్యక్ష పదవి కట్టబెట్టడంతోపాటు తన కుమారుడు విజయేంద్రకు శాసనసభ ఎన్నికల్లో టికెట్‌ కేటాయిస్తేనే తాను ఎన్నికల్లో క్రియాశీలకంగా ఉంటానని యడియూరప్ప తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. ఒకవేళ యడియూరప్పను కాదని నిర్ణయం తీసుకుంటే ప్రతికూల ఫలితాలు ఉంటాయేమోనని అధిష్టానం పెద్దలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇలాంటి చేదు అనుభవాలు రాష్ట్ర బీజేపీకి ఎదురైన సంగతి విదితమే. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే యడియూరప్పను విశ్వాసంలోకి తీసుకుని ముందుకు సాగాల్సి ఉంటుందని అధిష్టానం పెద్దలు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఈ కోవలో ప్రస్తుత కేంద్ర మంత్రి, యడియూరప్పకు అత్యంత సన్నిహితురాలైన శోభాకరంద్లాజే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బజరంగ్‌దళ్‌ నేపథ్యం కల్గిన హిందూత్వ ఫైర్‌ బ్రాండ్లుగా గుర్తింపు పొందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, విద్యుత్‌, కన్నడ సంస్కృతిశాఖల మంత్రి వీ సునిల్‌కుమార్‌(Minister V Sunilkumar) పేర్లు కూడా అధ్యక్ష పదవికి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో సునిల్‌కుమార్‌ విషయంలో మాత్రమే మాజీ సీఎం యడియూరప్ప ఒకింత సా నుకూలంగా ఉన్నట్టు సమాచారం. సునిల్‌కుమార్‌ యువనాయకుడు, బీసీ వర్గంలోని భిల్లవ సామాజిక వర్గానికి చెందినవారు. మాజీ సీఎం యడియూరప్పతో ఉత్తమ సంబంధాలు ఉన్నాయి. దక్షిణకన్నడ జిల్లా వాసి కావడంతో బాల్యం నుంచే ఆర్‌ఎ్‌సఎస్‌, హిందూ సంఘాలతో సంబంధాలు కలిగిన ఉన్నారు. సీటీ రవి రాష్ట్రంలోని బలమైన ఒక్కలిగ సామాజికవర్గానికి చెందినవారు. వి ద్యార్థి దశనుంచే ఆర్‌ఎ్‌సఎస్‌ భావజాలంతో ఎదిగారు. కేంద్రమంత్రి శోభాకరంద్లాజే(Union Minister Shobhakarandlaje) కూడా ఒక్కలిగ సామాజికవర్గానికి చెందినవారు. ఆమె గతంలో రాష్ట్ర మంత్రిగా, పార్టీలో భిన్నమైన హోదాల్లో సమర్థవంతంగా పనిచేసి గుర్తింపు పొందారు. గత మూడేళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ఆమె జోక్యం చేసుకోలేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సమర్థుడైన నేతను ఎంపిక చేయడం ద్వారా వచ్చే శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. దావణగెరెలో ఇటీవల జరిగిన సిద్దరామోత్సవ భారీగా విజయవంతం కావడంతో బీజేపీ నేతల కంటికి కునుకు కరువైంది. యడియూరప్ప సారథ్యంలో వెళితే తప్ప లక్ష్యాలు అందుకోలేమని పలువురు నేతలు అధిష్టానం పెద్దలకు వివరించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మంచి వాగ్ధాటి కలిగిన శోభాకరంద్లాజేను అధ్యక్షురాలిగా నియమించడమే సబబని పార్టీలోని అత్యధికులు భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత స్థితిలో హిందూత్వకార్డు ప్రయోగం వల్ల లభించే ప్రయోజనం శూన్యమని మాస్‌ లీడర్‌తోనే పార్టీ కేడర్‌ను ఏకతాటిపై నడిపించగలమని తద్వారా అన్ని వర్గాల అభిమానాన్ని చూరగొనగలమని వీరు అధిష్టానం వద్ద మొర పెట్టుకుంటున్నారు. వీటన్నింటి నేపథ్యంలో 2023 శాసనసభ ఎన్నికల ముందు రాష్ట్ర పార్టీ(State party) అధ్యక్షుడి ఎన్నిక అధిష్టానం పెద్దలకు అగ్ని పరీక్ష కానుంది. 





Updated Date - 2022-08-10T18:31:12+05:30 IST