పెట్రో ధరలు మీరెందుకు తగ్గించరు?

ABN , First Publish Date - 2022-06-01T14:10:50+05:30 IST

కేంద్రప్రభుత్వం పెట్రోల్‌ ధరలు తగ్గించినా, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని, ఈ కారణంగా ప్రజలపై తీవ్ర భారం పడుతోందంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం

పెట్రో ధరలు మీరెందుకు తగ్గించరు?

- రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం 

- సచివాలయ ముట్టడి యత్నం

- అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత


చెన్నై: కేంద్రప్రభుత్వం పెట్రోల్‌ ధరలు తగ్గించినా, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని, ఈ కారణంగా ప్రజలపై తీవ్ర భారం పడుతోందంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నేతృత్వంలో మంగళవారం ఉదయం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు జరిగాయి. పోలీసుల అనుమతి లేకుండా నిర్వహించిన ఆందోళనలో వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎగ్మూరు రాజరత్నం స్టేడియం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి సచివాలయ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట, వాగ్వివాదం నెలకొంది. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లోని పార్టీకి చెందిన 11 జిల్లాలకు చెందిన వందలాదిమంది కార్యకర్తలు, జిలా నాయకులు తరలివచ్చారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే సబర్బన్‌ ప్రాంతాల నుండి బీజేపీ కార్యకర్తలు వేల సంఖ్యలో ఎగ్మూరు రాజరత్నం స్టేడియం వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు అన్నామలై ఆ ప్రాంతానికి చేరుకోగా పార్టీ శ్రేణులంతా బీజేపీ వర్థిల్లాలి, అన్నామలై వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ  ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్న డీఎంకే ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదని, కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల వ్యవధిలో పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడంతో గతంలో లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. కొద్ది రోజుల క్రితం పెట్రోలు, డీజిల్‌ ధరల తగ్గించకపోవడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసిన ఎంపీ టీ ఆర్‌ బాలుని అడగాలని డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్‌ భారతి చెప్పారని, అలాంటప్పుడు బాలునే ముఖ్యమంత్రిగా చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పట్టించుకోని మంత్రులంతా ప్రస్తుతం స్టాలిన్‌ తనయుడు  ఉదయనిధికి మంత్రి పదవిని కట్టబెట్టాలంటూ జిల్లా స్థాయి సమావేశాలు జరుపుతుండటం సిగ్గుచేటన్నారు. మరో నాలుగు రోజుల్లో తాను మంత్రుల అవినీతి చిట్టా వెల్లడిస్తానని హెచ్చరించారు. ఇటీవల నగరంలో ప్రధాని మోదీ పాల్గొన్న సభలో కచ్చాదీవికి విముక్తి కల్పించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. కచ్చాదీవిని శ్రీలంకకు ధారపోసిన ఘనత అప్పటి డీఎంకే ప్రభుత్వానిదేనని, అలాంటప్పుడు ఆ దీవి తిరిగి తీసుకోవడం ఎలా సాధ్యమవుతుందని అన్నామలై ప్రశ్నించారు.

Updated Date - 2022-06-01T14:10:50+05:30 IST