No chance: డీఎంకేతో పొత్తుకు చాన్సే లేదు

ABN , First Publish Date - 2022-08-03T13:43:27+05:30 IST

భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు బద్ధ వ్యతిరేకి అయిన డీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై(Annamalai) స్పష్టం

No chance: డీఎంకేతో పొత్తుకు చాన్సే లేదు

- ఆవిన్‌లో మంత్రి సెంథిల్‌ బాలాజీ అక్రమాలు

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై  


అడయార్‌(చెన్నై), ఆగస్టు 2: భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు బద్ధ వ్యతిరేకి అయిన డీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై(Annamalai) స్పష్టం చేశారు. టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన కమలాలయంలో ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కోసం  మంగళవారం పలువురికి జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా డీఎంకే(DMK) నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకుని పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన గత్యంతరం తమకు లేదన్నారు. తమిళనాడు డే జూన్‌ 18, నవంబర్‌ 1 అంటూ ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం గందరగోళానికి గురిచేసిందన్నారు. ఇంతకాలం నవంబరు ఒకటినే తమిళనాడు డే గా నిర్వహిస్తున్నామన్నారు. ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Govt) పునఃపరిశీలన చేయాలని డిమాండ్‌ చేశారు. అర లీటరు ఆవిన్‌ పాల ప్యాకెట్‌లో 430 గ్రాముల పాలు మాత్రమే వుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. అయితే, కొందరు డీఎంకే నేతలు లీటర్‌, కేజీ బరువు ఒక్కటి కాదని వాదిస్తున్నారన్నారు. శాస్త్రపరంగా కేజీ పాలు, కేజీ బియ్యం ఒకటే బరువుంటాయన్నారు. ఆ ప్రకారంగా చూస్తే ప్రతి ఆవిన్‌ పాల ప్యాకెట్‌లో 60 నుంచి 70 గ్రాముల పాలు తక్కువగా ఉంటున్నట్లేనని, ఆ పాలు ఏమవుతున్నాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని అన్నామలై డిమాండ్‌ చేశారు. ఆవిన్‌(Avin) సంస్థలో రూ.2 కోట్లకు పైగా అవినీతి జరిగిందని, ఈ విషయమై త్వరలోనే ఆ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీని ఈడీ అధికారులు విచారణ జరుపుతారన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రమంతగా 50 లక్షల ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ సన్నాహాలు చేపట్టిందని, ఆ మేరకు జాతీయ పతాకాలను పంపిణీ చేస్తున్నామని అన్నామలై తెలిపారు. 

Updated Date - 2022-08-03T13:43:27+05:30 IST