యడియూరప్పకు బీజేపీ అధిష్ఠానం షాక్‌

ABN , First Publish Date - 2022-05-25T08:24:59+05:30 IST

కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పకు బీజేపీ అధిష్ఠానం షాక్‌ ఇచ్చింది.

యడియూరప్పకు బీజేపీ  అధిష్ఠానం షాక్‌

కుమారుడికి ఎమ్మెల్సీ టికెట్‌ నిరాకరణ

బెంగళూరు, మే 24(ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పకు బీజేపీ అధిష్ఠానం షాక్‌ ఇచ్చింది. వయోభారాన్ని కారణంగా చూపి ఏడాది కిందట ఆయనను గద్దె దింపిన పార్టీ అధిష్ఠా నం తాజాగా ఆయన చిన్నకుమారుడు విజయేంద్రకు ఎమ్మెల్సీ టికెట్‌ నిరాకరించింది. వారసత్వ రాజకీయాలకు చోటులేదని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టిన తరుణంలోనే అధిష్ఠానం కర్ణాటక పార్టీ అగ్రనేతకు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు పంపిందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం యడియూరప్ప షిమోగా జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇదే లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన పెద్దకుమారుడు బీవై రాఘవేంద్ర ప్రాతిని ధ్యం వహిస్తున్నారు.


చిన్నకుమారుడు విజయేంద్రకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే దేశవ్యాప్తంగా పార్టీపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడి గా ఉన్న బీవై విజయేంద్ర పేరు ఎమ్మెల్సీ టికెట్‌ కోసం పార్టీ కోర్‌ కమిటీ ఏకగీవ్రంగా సిఫార్సు చేసినా అధిష్ఠానం పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైం ది. దక్షిణాదిన కర్ణాటకలో బీజేపీకి అధికారాన్ని సాధించి పెట్టిన యడియూరప్ప అధిష్టానం తాజా నిర్ణయంతో ఖంగుతిన్నట్లు సమాచారం. కాగా శాసనమండలిలో ఖాళీ అవుతున్న 7 స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజైన మంగళవారం బీజేపీ నలుగురు, జేడీఎస్‌ ఒక అభ్యర్ధి పేరును ప్రకటించింది. కాంగ్రెస్‌ సోమవారం రాత్రే తన ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. వీరంతా ఒకే రోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఏడు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులే బరిలో ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవం కావచ్చునని భావిస్తున్నారు.

Updated Date - 2022-05-25T08:24:59+05:30 IST