యూపీ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్.. ఖాతా తెరవని ఎస్‌పీ

ABN , First Publish Date - 2022-04-12T23:00:58+05:30 IST

ఉత్తరప్రదేశ్ శాసన మండలి (కౌన్సిల్) ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్..

యూపీ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్.. ఖాతా తెరవని ఎస్‌పీ

లక్నో: ఉత్తరప్రదేశ్ శాసన మండలి (కౌన్సిల్) ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ సాధించింది. 36 సీట్లలో 33 సీట్లు ఎగరేసుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా-నేనా అన్నట్టు బీజేపీతో తలపడిన సమాజ్‌వాదీ పార్టీ మండలి ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. తక్కిన 3 సీట్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు. గత శనివారంనాడు ఎన్నికలు జరగగా, మంగళవారంనాడు ఫలితాలు ప్రకటించారు.


కాగా, ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.  జైలులో ఉన్న మాఫియా డాన్ బ్రిజేష్ సింగ్ కుటుంబం మరోసారి అక్కడ తమ పట్టు చాటుకుంది. బ్రిజేష్ సింగ్ భార్య అన్నపూర్ణ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. సమాజ్‌వాదీ పార్టీ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది.


బీజేపీ అభ్యర్థులు ఘాజిపూర్, మీరట్, ఘజియాబాద్, ఫతేపూర్-కాన్పూర్, లక్నో, సీతాపూర్, ఉన్నావో, రాయబరేలి, జౌన్‌పూర్, బహరైచ్, గోరఖ్‌పూర్, గోండా, బల్లియా, ఫరూఖాబాద్, ఝాన్సీ-లలిత్‌పూర్-జలౌన్, ప్రయాగ్‌రాజ్-కౌషంబి, పిలిభిత్-షాజహాన్‌పూ‌ర్‌లలో గెలుపొందారు. వారణాసి, ప్రతాప్‌గఢ్, అజంగఢ్ సీట్లను స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు. కాగా, బీజేపీ 9 స్థానాల్లో పోటీ లేకుండానే గెలిచింది. ఇక్కడ చివరి నిమిషంలో అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవడం, సాంకేతిక కారణాల వల్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు తోసిపుచ్చడం వంటివి జరిగాయి.


గతంలోనూ కౌన్సిల్ ఎన్నికల్లో అధికారంలోకి ఉన్న పార్టీలే గరిష్టంగా సీట్లు గెలుచుకున్నాయి. 2016లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 36 కౌన్సిల్ స్థానాల్లో 31 స్థానాలను ఎస్‌పీ గెలుచుకుంది. 2010లో బీఎస్‌పీ అధికారంలో ఉండగా జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో 36 ఎమ్మెల్సీ స్థానాల్లో 34 స్థానాల్లో గెలుపొందింది.


బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది: అఖిలేష్

కాగా, శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార యంత్రాంగాన్ని బీజేపీ దుర్వినియోగం చేసిందని తాజా ఫలితాలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. చాలా ప్రాంతాల్లో తమ అభ్యర్థులను నామినేషన్ వేయనీయలేదని ఆరోపించారు. మరోవైపు, తాజా ఎమ్మెల్సీ ఫలితాలతో యూపీ కౌన్సిల్‌లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధించింది. 100 స్థానాల్లో బీజేపీకి  68 మంది సభ్యుల బలం ఉండగా, సమాజ్‌వాదీ పార్టీకి 16 మంది సభ్యులు ఉన్నారు.

Updated Date - 2022-04-12T23:00:58+05:30 IST