కెప్టెన్‌తో పొత్తుకు అవకాశం: అమిత్‌షా

ABN , First Publish Date - 2021-12-04T22:24:51+05:30 IST

కెప్టెన్ అమరీందర్ సింగ్, అకాలీదళ్ మాజీ నేత సుఖ్‌దేవ్ సింగ్ థిండ్సా పార్టీలతో పొత్తు పెట్టుకుని పంజాబ్ ఎన్నికల్లో ..

కెప్టెన్‌తో పొత్తుకు అవకాశం: అమిత్‌షా

న్యూఢిల్లీ: కెప్టెన్ అమరీందర్ సింగ్, అకాలీదళ్ మాజీ నేత సుఖ్‌దేవ్ సింగ్ థిండ్సా పార్టీలతో పొత్తు పెట్టుకుని పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా తెలిపారు. శనివారంనాడిక్కడ జరిగిన 'హిందుస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌'లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కెప్టెన్, థిండ్సాలతో మాట్లాడతామని, కుదిరితే పొత్తు ఉంటుందని చెప్పారు. రైతుల నిరసనల విషయంలో ప్రధాని పెద్ద మనసు చూపించి, సాగు చట్టాలతో ప్రయోజనం లేదని రైతులు భావిస్తే వాటిని వెనక్కి తీసుకుంటామని చెప్పారని, ఇక పంజాబ్ విషయంలో ఎలాంటి సమస్యలు లేవనే తాను అనుకుంటున్నానని చెప్పారు. యోగ్యతల (మెరిట్) ఆధారంగా పంజాబ్ ఎన్నికలు ఉంటాయని ఆయన నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు.


జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై..

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాపై అమిత్‌షా మాట్లాడుతూ, ఎన్నికల తర్వాతే రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర హోదాపై మాట్లాడుతున్న వారు కేవలం రాజకీయ వివాదం సృష్టించేందుకే ప్రయత్నిస్తున్నారని అన్నారు. తొలుత రాష్ట్ర హోదా పునరుద్ధరించి, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే రాజకీయ డిమాండ్ ఉందని, నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినందున తొలుత నియోజకవర్గాల విభజన జరిపి, ఎన్నికలు జరగాల్సి ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాతే రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఇదే విషయం తాను చాలాసార్లు చెప్పానని, అయితే కొందరు దీనిని రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.


ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై..

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని, విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడినప్పటికీ ఎలాంటి ప్రభావం ఉండదని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. కూటముల ఆధారంగా ఓట్లు అంచనా వేయకూడదని, రాజకీయాలంటే ఫిజిక్స్ కాదని, కెమిస్ట్రీ అని అన్నారు. ఒకసారి కాంగ్రెస్, సమాజ్‌వాదీ కలిసి పోటీ చేశాయని, ఆ తర్వాత మూడు పార్టీలు కలిసి పోటీకి దిగాయని, ఆ రెండు పర్యాయాలు బీజేపీనే గెలిచిందని అన్నారు. రైతుల నిరసన ప్రభావంపై మాట్లాడుతూ, ఇంతకుముందు కూడా రైతు నిరసనల ప్రభావం యూపీలో తక్కువగానే ఉందని, ఇప్పుడైతే అసలు కారణం అంటూ ఏమీ లేదని చెప్పారు.


ఒమైక్రాన్‌పై...

కొత్త కోవిడ్ వేరియంట్ ఒమైక్రాన్‌ పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని అమిత్‌షా తెలిపారు. ప్రస్తుతానికైతే ఎలాంటి నిర్దిష్ట అభిప్రాయానికి రాలేదని, ఏదైనా ఉంటే అది ప్రజల మందుంచుతామని చెప్పారు. ప్రజల్లో అవేర్‌నెస్ ముఖ్యమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, రెండో డోస్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు. అయితే, అనవసర వివాదానికి తావీయరాదనే ఉద్దేశంతోనే వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేయడం లేదని చెప్పారు.

Updated Date - 2021-12-04T22:24:51+05:30 IST