
న్యూఢిల్లీ: 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల(2024 Indian general election)కు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలపై ఆ పార్టీ ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతోంది. దీనికి సంబంధించి పార్టీలోని ముఖ్య నేతలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. మంత్రులంతా బీజేపీ ఓడిన 140 లోక్‌సభ స్థానాల్లో పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ అధికారంలో ఉన్న ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు విడమర్చి చెప్పాలని, వచ్చే ఎన్నికల్లో మరిన్ని స్థానాలను గెలిచేలా పని చేయాలని ఆయన సూచించారు. నరేంద్రమోదీ ప్రధానిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి ఎనిమిది ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం మే 25న ప్రారంభమైందని ఇది జూన్ 31 వరకు కొనసాగుతుందని సమాచారం. ప్రతి నియోజకవర్గంలోని కనీసం 30 మంది బూత్ స్థాయి కార్యకర్తల్ని కలుసుకుని, పార్టీ బలహీనంగా ఉన్న 100 బూతుల రిపోర్ట్ తీసుకురావాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు 10 మంది బూత్ స్థాయి కార్యకర్తలను కలిసి 25 బూత్‌ల రిపోర్ట్ సేకరించాల్సి ఉంటుందని పార్టీ నేతలకు అమిత్ షా సూచించారు.
ఇవి కూడా చదవండి