హరిద్వార్ ప్రసంగం గురించి అడగ్గానే ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయిన బీజేపీ సీనియర్ నేత

ABN , First Publish Date - 2022-01-11T23:05:10+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత వచ్చిన వ్యాఖ్యలపైన మీరెందుకు ప్రశ్నించరు? అయినా హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్ సభకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదు. అది బీజేపీ నిర్వహించిన కార్యక్రమం కాదు. కాకపోతే అది హిందూ మతానికి చెందిన వారిది..

హరిద్వార్ ప్రసంగం గురించి అడగ్గానే ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయిన బీజేపీ సీనియర్ నేత

న్యూఢిల్లీ: హరిద్వార్ విధ్వేష ప్రసంగం గురించి అడగ్గానే సమాధానం చెప్పకుండా ఇంటర్వ్యూను మధ్యలోనే ఆపేసి వెళ్లి పోయారు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య. మంగళవారం బీబీసీతో జరిగిన ఇంటర్వ్యూలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బీబీసీ ప్రతినిధులు తెలిపారు. కెమెరాను ఇంటర్వ్యూ మధ్యలోనే ఆపించేసి రిపోర్టర్ మాస్క్ తొలగించి సదరు వీడియోను డిలీట్ చేయమని మౌర్య డిమాండ్ చేసినట్లు బీబీసీ హిందీ పేర్కొంది.


దీనికి సంబంధించిన వీడియోను బీబీసీ హిందీ యూట్యూబ్ ఛనాల్‌లో అప్‌లోడ్ చేశారు. కొద్ది సమయం పాటు ఇంటర్వ్యూ కొనసాగిన తర్వాత రిపోర్ట్ హరిద్వార్ విధ్వేష ప్రసంగంపై మౌర్యను ప్రశ్నించారు. దానికి ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. హిందువులను మాత్రమే ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని ఎదురు ప్రశ్నించారు. అన్ని మతాల పైన ఇలాంటి ప్రశ్నలు వేస్తే సమాదానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్న ఆయన.. ఇలాంటి ప్రశ్నలు అడుగుతామని ముందే చెప్పి ఉంటే తాను ప్రిపేర్ అయి వచ్చేవాడినన్నారు. ‘‘మీరు ఎన్నికల గురించి ప్రశ్నిస్తున్నారా? మీరు అసలు జర్నలిస్టులే కాదు. ఒక ప్రత్యేకమైన గ్రూపుకి ఏజెంట్‌గా మాట్లాడుతున్నారు. నేను మీతో మాట్లాడను’’ అంటూ మౌర్య వెళ్లిపోయారు.


దీనికి ముందు కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ ‘‘జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత వచ్చిన వ్యాఖ్యలపైన మీరెందుకు ప్రశ్నించరు? అయినా హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్ సభకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదు. అది బీజేపీ నిర్వహించిన కార్యక్రమం కాదు. కాకపోతే అది హిందూ మతానికి చెందిన వారిది. దీనికి రాజకీయంతో సంబంధం ఏంటి? క్రైస్తవ, ముస్లిం లీడర్లు కూడా ఉన్నారు. వాళ్ల గురించి కూడా మాట్లాడండి’’ అని అన్నారు.

Updated Date - 2022-01-11T23:05:10+05:30 IST