హిమాలయాల నుంచి సముద్రం వరకూ బీజేపీని ఆశీర్వదించారు: మోదీ

ABN , First Publish Date - 2022-03-11T02:12:44+05:30 IST

హిమాలయాల (ఉత్తరాఖండ్) నుంచి సముద్రం (గోవా) వరకూ నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని ఆశీర్వదించారని ప్రధాని మోదీ ..

హిమాలయాల నుంచి సముద్రం వరకూ బీజేపీని ఆశీర్వదించారు: మోదీ

న్యూఢిల్లీ: హిమాలయాల (ఉత్తరాఖండ్) నుంచి సముద్రం (గోవా) వరకూ నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని ఆశీర్వదించారని ప్రధాని మోదీ అన్నారు. పదవ తేదీనే హోలీ వస్తుందని తాము చెప్పిన విధంగానే ఈరోజు హోలీ సంబరాలు మన ముందుకు వచ్చేశాయని, ఇది భారత ప్రజాస్వామ్య పండుగ అని నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నారు. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.


దేశానికి ఎందరో ప్రధానులను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అందించిందని, అయితే సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ తిరిగి అధికారంలోకి రావడం మాత్రం ఇదే ప్రథమమని యోగి ఆదిత్యనాథ్ విజయాన్ని మోదీ ప్రశంసించారు. దీనికి తోడు బీజేపీ ఓటింగ్ షేర్ కూడా యూపీలో పెరిగిందన్నారు. గోవాలో ఎగ్జిట్ పోల్స్ తప్పని మరోసారి రుజువయ్యాయని అన్నారు. బీజేపీ మూడోసారి వరుసగా, అదికూడా మెజారిటీ సీట్లతో గెలుపొందిందన్నారు. ఉత్తరాఖండ్‌లో సైతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తిరిగి మెజారిటీ సీట్లతో గెలవడం ఇదే మొదటి సారని చెప్పారు. మణిపూర్‌లో కూడా ఇదే జరిగిందన్నారు. హిమాలయాల (ఉత్తరాఖండ్) నుంచి సముద్రం (గోవా) వరకూ, పెద్ద రాష్ట్రమైన యూపీ నుంచి ఎక్కడో సుదూర ప్రాంతంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ వరకూ యావత్ భారతదేశ ప్రజల ఆశీస్సులను బీజేపీ అందుకొందని అన్నారు.


హోలీ పండుగ ఈసారి మార్చి 10నే వచ్చేస్తుందని తాము చెప్పినట్టే జరిగిందని, ఇది ఎన్డీయే కార్యకర్తల 'విక్టరీ 4' (నాలుగు రాష్ట్రాల విజయం) అని మోదీ పేర్కొన్నారు. బీజేపీకి విజయాన్ని చేకూరుస్తూ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. 2019లో (కేంద్రంలో) తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కొందరు 'నిపుణులు' 2017లో విజయమే (యూపీలో) ఇందుకు కారణమని చెప్పారని, అదే నిపుణులు ఇప్పుడు 2022 ఎన్నికల ఫలితాలే 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తారని తాను అనుకుంటున్నట్టు మోదీ పేర్కొన్నారు. కాగా, బీజేపీ విజయోత్సవ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సైతం పాల్గొని ప్రసంగించారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే రీతిలో కష్టపడతామని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య వారు పేర్కొన్నారు.

Updated Date - 2022-03-11T02:12:44+05:30 IST