చెప్పులు విసురుకుని... కర్రలతో కొట్టుకుని...

ABN , First Publish Date - 2022-07-02T06:31:12+05:30 IST

హనుమకొండలో రాజకీయం వేడెక్కుతోంది. ఒక పక్క బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు, మరో పక్క ఆ పార్టీకి చెక్‌ పెట్టేందుకు బీజేపీ కార్పొరేటర్లపై టీఆర్‌ఎస్‌ వలలు, ఇంకో పక్క కాంగ్రెస్‌ ధర్నాలతో జిల్లాలో పొలిటికల్‌ వార్‌ పదునెక్కుతోంది.

చెప్పులు విసురుకుని... కర్రలతో కొట్టుకుని...
పరస్పరం దాడి చేసుకుంటున్న బీజేపి, కాంగ్రెస్‌ కార్యకర్తలు

కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణుల ఘర్షణ
హంటర్‌రోడ్డులోని బీజేపీ కార్యాలయ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత
ఇరువర్గాల దాడుల్లో సీఐకి, గన్‌మెన్‌కు గాయాలు
లాఠీచార్జితో చెదరగొట్టిన పోలీసులు
కాంగ్రెస్‌ నేత, మాజీ మేయర్‌ స్వర్ణ కారు ధ్వంసం
అగ్నిపథ్‌ రద్దు కోరుతూ కాంగ్రెస్‌ ధర్నాకు దిగిన ఫలితం


హనుమకొండ, జూలై 1 (ఆంధ్రజ్యోతి) :  హనుమకొండలో రాజకీయం వేడెక్కుతోంది. ఒక పక్క బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు, మరో పక్క ఆ పార్టీకి చెక్‌ పెట్టేందుకు బీజేపీ కార్పొరేటర్లపై టీఆర్‌ఎస్‌ వలలు, ఇంకో పక్క కాంగ్రెస్‌ ధర్నాలతో జిల్లాలో పొలిటికల్‌ వార్‌ పదునెక్కుతోంది. శుక్రవారం బీజేపీ  జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ సంఘటనలో పోలీసులు, కార్యకర్తలు గాయపడే పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్‌లో ఈనెల 2 నుంచి జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నగరంలో బీజేపీ మోర్చాల సమావేశాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిలో పాల్గొనేందుకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ తరుణంలో  హనుమకొండ హంటర్‌రోడ్డులోని బీజేపీ కార్యాలయం ఎదుటే కాంగ్రెస్‌ ధర్నాకు దిగడం  అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఇరు పార్టీల వారితోపాటు పోలీసులకూ గాయాలయ్యాయి.  వివరాల్లోకి వెళితే...

కేంద్ర ప్రభుత్వం సైనికుల నియామకానికి కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీజేపీ హనుమకొండ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్‌ నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీ జెండాలను చేతపట్టుకొని హనుమకొండ హంటర్‌ రోడ్డులో ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయం వద్దకు సాయంత్రం  3గంటలకు చేరుకున్నారు.

అదే సమయంలో ఈనెల 2 నుంచి హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో వివిధ మోర్చాల ప్రతినిధుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కార్యకర్తలతో కార్యాలయం కిటకిటలాడుతోంది. పార్టీ కార్యాలయం వద్దకు కాంగ్రెస్‌ కార్యకర్తలు చేరుకోగానే తమ కార్యాలయం ఎదుట ధర్నా చేయకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వేరే ఎక్కడన్నా జరుపుకోక ధర్నాను తమ పార్టీ కార్యాలయం ఎదుట  చేయడమేమిటంటూ వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకున్నది.

ఇంతలో మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ తన కారులో అక్కడికి చేరుకోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఆమె కారుపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. జెండా కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఘర్షణ తీవ్ర స్థాయికి చేరి పరిస్థితి చేయిదాటేట్టు ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలను దూరంగా  తరిమేందుకు లాఠీచార్జి చేశారు.

పోలీసులకు గాయాలు

ఇరువర్గాల ఘర్షణలో కర్రలు తగిలి కేయూ పోలీసు స్టేషన్‌ సీఐ దయాకర్‌ ఎడమ చేతికి, సుబేదారి  సీఐ రాఘవేందర్‌ గన్‌మెన్‌ అనిల్‌ తలకు గాయమైంది. వరంగల్‌ రామన్నపేటకు చెందిన పృధ్వి  అనే  కాంగ్రెస్‌ కార్యకర్త కూడా గాయపడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన  జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీజేపీ కార్యకర్తలు తమ కారును ధ్వంసం చేయడాన్ని మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ నిరసిస్తూ వారిని అరెస్టు చేసి కేసు పెట్టాలని, అంత వరకు దెబ్బతిన్న తనకారును అక్కడి నుంచి తీసుకువెళ్లేది లేదంటూ మొండికేశారు.  పోలీసులు రాజేందర్‌ రెడ్డికి, స్వర్ణకు నచ్చచెప్పి అక్కడ నుంచి పంపించి వేశారు. ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ సీఐ గన్‌మెన్‌ అనిల్‌, కాంగ్రెస్‌ కార్యకర్త పృధ్విలను చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.

ఖండనలు
 కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడి బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని నాయిని రాజేందర్‌ రెడ్డి ఖండించారు. మోదీ ప్రభుత్వం జిల్లాకు చేసిందేమి లేదని, కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంలో విఫలమైందని, ఇప్పుడు తాజాగా నిరుద్యోగ యువకులకు నష్టం కలిగించే అగ్నిపథ్‌ తెచ్చిందని, దీనిపై నిరసన తెలపడానికి వస్తే బీజేపీ కార్యకర్తలు తమపై  విచక్షణారహితంగా దాడి చేశారని అన్నారు.

మరోవైపు బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్‌ దాడి చేయడాన్ని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కూడా ఖండించారు. ప్రజాసమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు రోడ్లపై చేయాలి కానీ తమ కార్యాలయం ఎదుట ఏమిటని ప్రశ్నించారు. మోదీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇలాంటి కుటిలదాడులకు పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు.  
 









Updated Date - 2022-07-02T06:31:12+05:30 IST