TRS వర్సెస్‌ BJP

ABN , First Publish Date - 2022-01-03T16:37:09+05:30 IST

రోడ్డు మరమ్మతు పనుల ప్రారంభోత్సవ విషయంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య ఏర్పడిన వాగ్వాదం తోపులాటకు, దాడి చేసేంతవరకు దారితీసింది. దీంతో బోయినపల్లిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

TRS వర్సెస్‌ BJP

మరమ్మతు పనుల ప్రారంభోత్సవంలో నాయకుల మధ్య తోపులాట

హైదరాబాద్/బోయిన్‌పల్లి: రోడ్డు మరమ్మతు పనుల ప్రారంభోత్సవ విషయంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య ఏర్పడిన వాగ్వాదం తోపులాటకు,  దాడి చేసేంతవరకు దారితీసింది. దీంతో బోయినపల్లిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కంటోన్మెంట్‌బోర్డుకు సంబంధించిన పాలకమండలి సభ్యుల పదవీకాలం గత ఏడాది ముగిసింది. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే ఈ బోర్డుకు రక్షణశాఖ సివిలియన్‌ నామినేటెడ్‌ సభ్యుడిగా బీజేపీ నాయకుడు జె.రామకృష్ణను ఇటీవల నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.


టీఆర్‌ఎస్‌ నాయకుడు, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి హయాంలో 2019లో రూ.75 లక్షల బోర్డు నిధులతో వేసిన రోడ్డుకు ఆదివారం ఉదయం కంసారిబజార్‌లోని చాయ్‌ అడ్డా వద్ద మరమ్మతు పనుల ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జక్కుల మహేశ్వర్‌రెడ్డి అనుచరులు, కార్యకర్తలు తమ హయాంలో నిధులు మంజూరైతే బీజేపీ నాయకులు రోడ్డు ప్రారంభోత్సవంఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాన్ని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ అడ్డుకోవడంతో బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగారు.  ఈ క్రమంలో జక్కుల మహేశ్వర్‌రెడ్డి అక్కడకు చేరుకోగానే రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్తలు దూషణలకు పాల్పడడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రతిదూషణలకు పాల్పడడంతో మాటా మాటా పెరిగి పెద్ద ఎత్తున తోపులాట జరిగి ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు వర్గాల నాయకులు బోయిన్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకొన్నారు. కేసు దర్యాప్తు చేపట్టామని, సీఐ రవికుమార్‌ తెలిపారు. 


వేసిన రోడ్లకు శంకుస్థాపనలా..

మా హయాంలో నిధులు మంజూరు చేసి రోడ్లు నిర్మిస్తే బీజేపీ నాయకులు మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి అనుమతులు లేవు. సీఈవో నుంచి వివరణ కోరిన తరువాతే మేం అడ్డుకునే ప్రయత్నం చేశాం.    

- జక్కుల మహేశ్వర్‌ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్‌ బోర్డు


అభివృద్ధి పనులను అడ్డుకొంటారా.. 

కంటోన్మెంట్‌లో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక టీఆర్‌ఎస్‌ నేత, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌ రెడ్డి అభివృద్ధి పనులను అడ్డుకునే ప్రయత్నాలకు తెరతీశారు. రూ.45 లక్షలతో చేపట్టిన పనులను అడ్డుకుంటున్నారు. పూర్తి అనుమతులు వచ్చాకే శంకుస్థాపనలు చేస్తున్నాం. బీజేపీ కార్యకర్తలపైన జరిగిన దాడిని నిరసిస్తూ నేడు బ్లాక్‌ డేగా పాటిస్తున్నాం.

-రామకృష్ణ, రక్షణశాఖ సివిలియన్‌ నామినేటెడ్‌ సభ్యుడు, కంటోన్మెంట్‌ బోర్డు

Updated Date - 2022-01-03T16:37:09+05:30 IST