కశ్మీరీయత్‌ను ఔదలదాల్చిన బీజేపీ

ABN , First Publish Date - 2022-03-22T08:00:25+05:30 IST

భారతదేశం కశ్మీర్‌ను ఎంత ప్రేమిస్తున్నదో ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా అద్భుత విజయం చూసిన వారికి అర్థమవుతోంది. ఈ సినిమాలో అభిమాన సంఘాలున్న కథానాయకులు లేరు. ఉత్తుత్తి ఫైట్లతో వందమందిని ఒకరే తుక్కుతుక్కుగా కొట్టే సన్నివేశాలు లేవు...

కశ్మీరీయత్‌ను ఔదలదాల్చిన బీజేపీ

భారతదేశం కశ్మీర్‌ను ఎంత ప్రేమిస్తున్నదో ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా అద్భుత విజయం చూసిన వారికి అర్థమవుతోంది. ఈ సినిమాలో అభిమాన సంఘాలున్న కథానాయకులు లేరు. ఉత్తుత్తి ఫైట్లతో వందమందిని ఒకరే తుక్కుతుక్కుగా కొట్టే సన్నివేశాలు లేవు. ఉన్నదల్లా కొన్ని దశాబ్దాలుగా స్రవిస్తున్న నెత్తురూ, కన్నీళ్లు, తమ భూమి నుంచి తాము వేరువడి చెల్లాచెదురై జీవిస్తూ, మరణిస్తూ ఉన్న అభాగ్యుల హృదయ విదార గాథ. మొత్తం సినిమాలో ఎక్కడా అవాస్తవాలు లేవు, జరిగిన సంఘటనలేవీ ఎవరో సృష్టించినవి కావు. చరిత్ర పుటల్లో నమోదైన ఘాతుకాలు మాత్రమే. అందుకే భారత ప్రజలు ఈ సినిమాను హత్తుకున్నారు.


ఈ సినిమాలో కశ్మీర్ చరిత్ర ఉన్నది. కశ్మీర్ విషయంలో నెహ్రూతో పాటు కాంగ్రెస్ నేతలు పాల్పడిన ఘోరమైన తప్పిదాలున్నాయి. కశ్మీర్ పండితులకు, హిందువులకు తమ స్వంత దేశంలో రక్షణ కల్పించలేకపోయిన ప్రభుత్వ అసమర్థ విధానాలున్నాయి. హంతకులు, ఉగ్రవాదులను చర్చలకు ఆహ్వానించి నెత్తిన కెత్తించుకున్న నేతల దుర్మార్గ స్వభావమూ మనకు అర్థమవుతుంది, సీమాంతర ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పొరుగు దేశమైన పాకిస్ధాన్‌ను అడ్డుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వాల భీరత్వమూ మనకు కనపడుతుంది. కశ్మీర్‌లో ఉగ్రవాదులను స్వాతంత్ర్యం కోసం పోరాడే శక్తులుగా చిత్రిస్తూ భారతీయ యువత మనసులను కలుషితం చేయాలనుకునే కుహనా లౌకిక వాదులు, వామపక్షీయుల బూటకపు కుతంత్రాలూ మనకు అవగతమవుతాయి.


తొలి ప్రధాని నెహ్రూ కశ్మీర్ విషయంలో ఘోర తప్పిదాలకు పాల్పడ్డారు. ప్రధాని పదవి చేపట్టే ఆతురతలో చివరి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ కశ్మీర్ ప్రతిపత్తిని వివాదం చేస్తూన్నా నెహ్రూ విస్మరించారు. భారతదేశం నుంచి వెళ్లిపోతున్న ఒక వలస శక్తి ప్రతినిధి ఒత్తిడికి గురయ్యారు. మౌంట్ బాటెన్‌కూ నెహ్రూ మధ్య ఉన్న అవగాహన ప్రకారమే భారత విభజన జరిగి కశ్మీర్ సమస్య ఉత్పన్నమయ్యేందుకు కారణమైంది. జనరల్ కరియప్ప అభ్యంతరాలు చెబుతున్నా వినకుండా తిరుగుబాటుదారులపై కాల్పుల విరమణను ప్రకటించారు. దాని వల్ల కశ్మీర్‌లో మూడో వంతు భారతదేశం కోల్పోయింది. ఉప ప్రధాని సర్దార్ పటేల్ వ్యతిరేకించినప్పటికీ నెహ్రూ కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి నివేదించారు. కశ్మీర్‌కు ఆర్టికల్ 370 అధికరణ ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి దాన్ని భారతదేశంలో అంతర్భాగం చేయకుండా త్రిశంకు స్వర్గంలో వ్రేళ్లాడ దీసిన ఘనత నెహ్రూకు దక్కుతుంది. భారత్‌లో కశ్మీర్‌ను విలీనం చేసేందుకు ప్లెబిసైట్‌కు హామీ ఇచ్చింది కూడా నెహ్రూయే. 1953లో షేక్ అబ్దుల్లాతో ఒప్పందం చేసుకుని కశ్మీర్‌పై పూర్తి హక్కులు ధారాదత్తం చేసింది ఆయనే. 563 సంస్థానాలు భారత్‌లో విలీనం కావాల్సి ఉండగా 562 సంస్థానాల విలీనాన్ని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు అప్పగించి, కేవలం కశ్మీర్‌ను విలీనం చేసే బాధ్యతను నెహ్రూ స్వీకరించారు. నిజానికి కశ్మీర్ బాధ్యతను కూడా పటేల్‌కు అప్పగించి ఉంటే ఇవాళ కశ్మీర్ విషయంపై చర్చే ఉండేదే కాదు. షేక్ అబ్దుల్లాతో తన స్నేహం రీత్యానే నెహ్రూ కశ్మీర్‌కు అన్యాయం చేశారన్నది, పాక్ కశ్మీర్‌లో కొంత భాగం ఆక్రమించిందన్నది చరిత్ర పుటల్లో నమోదైంది. తొలుతే కశ్మీర్‌లో పాక్ చొరబాటుదారుల్ని పూర్తిగా నిర్మూలించి ఉంటే, యుద్ధాన్ని ఒకేసారి ముగించేందుకు ప్రయత్నించి ఉంటే, ఐక్యరాజ్యసమితికి సమస్యను నివేదించకుండా ఉంటే, సైనిక ఆధిపత్యం ఉన్నప్పటికీ కాల్పుల విరమణకు అంగీకరించి ఉంటే, 370 అధికరణను ప్రవేశపెట్టకుండా ఉంటే కశ్మీర్ ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు అడ్డాగా మారేది కాదు. ప్రజల మధ్య మానసిక అడ్డుగోడలు ఏర్పడేవి కావు, పాక్ నిరంతరం ఆజ్యం పోసేందుకు వీలు ఉండేది కాదు.


భారతీయ జనతా పార్టీ అస్తిత్వం, మూలాలు కశ్మీర్‌లో ఉన్నాయి. బిజెపికి జమ్ము కశ్మీర్ కేవలం భారత్‌లో అంతర్భాగం మాత్రమే కాదు, ఒక అస్తిత్వం కూడా. 1953లోనే భారతీయ జనసంఘ్ కాన్పూర్ సదస్సులో జమ్ము కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసేందుకు ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ, ప్రేమ్‌నాథ్ డోగ్రా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. ‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రదాన్, ఔర్ దో నిషాన్ నహీ చలేగీ, నహీ చలేగీ’ (ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలా? ఇద్దరు ప్రధానమంత్రులా? రెండు జాతీయ పతకాలా? చెల్లదు కాక చెల్లదు) అన్న నినాదాన్ని చేపట్టింది. చాలా సంవత్సరాల పాటు జమ్ము కశ్మీర్ భూభాగంలో ఎక్కడా మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేకపోయేవారం. ఏ భారతీయుడూ ప్రత్యేక అనుమతి లేకుండా ఆ రాష్ట్రంలో ప్రవేశించలేకపోయేవారు. సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్‌కు కానీ చివరకు రాష్ట్రపతికి గానీ ఎలాంటి అధికారం ఉండేది కాదు. కశ్మీర్‌లో పర్మిట్ లేకుండా ప్రవేశించారన్న ఆరోపణతోనే 1953 మే 11న డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీని అరెస్టు చేశారు. నిర్బంధంలోనే ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మరణంపై విచారణ కమిషన్ నియమించాలన్న డిమాండ్‌ను నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోలేదు.


విచిత్రమేమంటే కశ్మీర్‌లో స్వతంత్ర పోరాటం జరుగుతున్నదనే వారు కశ్మీర్ చరిత్రను లెక్కచేయరు, కాంగ్రెస్ విధానాల వల్ల అక్కడ ఉగ్రవాదం పెచ్చరిల్లిందని అంగీకరించరు. లక్షలాది మంది కశ్మీరీ పండితులపై అమలు చేసిన దారుణాలను విమర్శించబోరు. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులకు లభిస్తున్న ఆర్థిక, ఆయుధాల మద్దతును పట్టించుకోరు. ఉగ్రవాదులు హింసాకాండకు, హత్యలకు, విధ్వంసాలకు పాల్పడడాన్ని విమర్శించకుండా వారితో పోరాడుతున్న భారతీయ సైనికులను మాత్రమే వారు నిందిస్తారు. కశ్మీరీ పండితులు ఏం పాపం చేశారని వారిని ఊచకోత కోశారు? 370 అధికరణ రద్దు ద్వారా కశ్మీర్ విషయంలో ఎలాంటి రాజీ లేదని ప్రపంచానికి సంకేతాలు పంపిన భారతీయ జనతా పార్టీ ఇలాంటి విచ్ఛిన్నకరశక్తుల ప్రచారాన్ని పూర్తిగా విస్మరిస్తుంది. భారతీయ అస్తిత్వాన్ని నిలబెడుతుంది. చెరిగిపోయిన కశ్మీరీ పూర్వవైభవాన్ని పునరుద్ధరించడమే, కశ్మీరీ పండితుల కుటుంబాలు మళ్లీ ఆనందంతో తమ జన్మభూమిలో నివసించేందుకు వాతావరణాన్ని కల్పించడమే నరేంద్రమోదీ సారథ్యంలో బిజెపి ఎంచుకున్న లక్ష్యం. అన్నిటికంటే ముఖ్యంగా కశ్మీరీయత్‌కు బీజేపీ అమిత ప్రాధాన్యత నిస్తుంది. అదే శైవమతం, బౌద్ధం, ఇస్లాం మేళవించిన సంస్కృతి. కశ్మీరీ మహాకవయిత్రి లల్లేశ్వరి వారధిగా నిలిచిన సంస్కృతి. ఈ సంస్కృతిని గౌరవించినవారికే భారత ప్రజల ఆదరాభిమానాలు వెల్లువలా లభిస్తాయి. ఇవాళ భారత దేశంలో బిజెపి విజయం వెనుక ఉన్న ప్రజాబలం రహస్యం ఇదే.


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-03-22T08:00:25+05:30 IST