Assembly elections: బీజేపీ ‘వార్‌ రూమ్‌’ ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-11T17:57:12+05:30 IST

రానున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మల్లేశ్వరం(Malleshwaram)లోని కెనరా యూనియన్‌ వద్ద ఉన్న కార్యాలయంలో బీజేపీ ప్రత్యేక

Assembly elections: బీజేపీ ‘వార్‌ రూమ్‌’ ప్రారంభం

బెంగళూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): రానున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో మల్లేశ్వరం(Malleshwaram)లోని కెనరా యూనియన్‌ వద్ద ఉన్న కార్యాలయంలో బీజేపీ ప్రత్యేక వార్‌ రూమ్‌(War room)ను ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌, రాజ్యసభ సభ్యుడు జగ్గేశ్‌ బుధవారం సాయంత్రం వార్‌ రూమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. శాసనసభ ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టేలా వార్‌ రూమ్‌ పనిచేస్తుందని కటీల్‌ మీడియాకు తెలిపారు. సాంకేతిక నిపుణులు, బీజేపీ ఐటీ విభాగం వార్‌ రూమ్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయన్నారు. గ్రామ, హోబళి, తాలూకా, జిల్లా స్థాయిల్లో పార్టీ కార్యకలాపాలను వార్‌ రూమ్‌ నుంచే సమీక్షిస్తామన్నారు. ఇక్కడ మీడియా, సోషల్‌మీడియాకు ప్రత్యేక విభాగాలు ఉంటాయన్నారు. మీడియా సమావేశాలు, వర్క్‌షా్‌పలు ఇక్కడే నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‏ల విమర్శలను వార్‌ రూమ్‌ ద్వారా దీటుగా తిప్పి కొడతామన్నారు. సోషల్‌మీడియాను తమ పార్టీ నేతలు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా కసరత్తు చేస్తున్నామన్నారు. బూత్‌స్థాయిలో పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసే ప్రక్రియ పూర్తయిందన్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వివరాలు క్రోడీకరిస్తామన్నారు. వార్‌ రూమ్‌ కార్యకలాపాలను ప్రతివారం తాను సమీక్షిస్తానన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు నిర్మల్‌కుమార్‌ సురానా తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు. కొవిడ్‌ కారణంగా ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) ఆర్‌టీ నగర్‌లోని నివాసం నుంచే వార్‌ రూం ప్రారంభోత్సవాన్ని తిలకించారు. 

Updated Date - 2022-08-11T17:57:12+05:30 IST