ఫిబ్రవరి 22న సత్యకాలమ్లో ‘సిద్ధాంతాలతో ప్రమేయం లేకుండా కేవలం అధికారం కోసం, భారతీయ జనతా పార్టీ ఏనాడు రాజకీయాలు చేయలేదు’ అని రాశారు. కాని అధికారం కోసమే గదా మొన్న మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. రాజస్థాన్‌లోనూ సచిన్ పైలట్‌ను దువ్వి అధికారంలోనికి వద్దామనుకున్నారుగాని ఆటలు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు కీలుబొమ్మలని గుండెలు బాదుకొనే మోదీగారు కర్నాటకలో చేసినదేమిటి? ఉత్తరాఖండ్‌లో జరిగినదేమిటి? గోవాలో జరిగినదేమిటి? స్వరాష్ట్రం గుజరాత్లో ఎందుకు మార్చారు? వారు చేస్తే అది ప్రజాస్వామ్యం. ఇతరులు చేస్తే నిరంకుశత్వం. ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఇవన్నీ చేసారో సత్యకుమార్ గారు చెప్పాలి. ఇక లాల్‌కృష్ణ అడ్వానీ గురించి ఆయన మాట్లాడక పోవడమే మంచిది! ఎందుచేతనంటే ఈనాడు అద్వానీగారు, మురళీ మనోహర్ జోషి వంటి పెద్దలకు మోదీ ఎంత విలువ ఇస్తున్నారో అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఆదుకోవాలని వాదించిన ప్రముఖ వ్యక్తి, పెద్దమనిషి వెంకయ్యనాయుడు గారికి ఇచ్చిన విలువెంత? ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి ఆయన నోరు నొక్కేశారు. తలుపులు మూసి, కెమెరాలు బంద్ చేసి అన్యాయంగా ఆంధ్రను విభజించారని మోదీ మొసలి కన్నీరు కార్చారు. మరి వారు ఈ ఏడున్నరేళ్లలో ఆంధ్రకు చేసినదేమిటి? విశాఖ స్టీల్ ప్లాంటును మాత్రం నష్టాల పేరుతో అమ్మకానికి పెట్టారు! ఇవన్నీ ఏ సిద్ధాంతాల ప్రాతిపదికన చేస్తున్నవి? ఆంధ్ర విభజన పాత్రలో కాంగ్రెస్‌కు ఎంత పాపముందో, బీజేపీకి కూడా అంతే పాపం ఉంది. అందుకనే కడుపు మండిన ఆంధ్ర ప్రజలు కాంగ్రెసుకు గాని, బీజేపీకి గాని ఆంధ్రలో ఒక్క సీటు కూడా లేకుండా చేసారు. మమత బెనర్జీ చెప్పినట్లు గడ్డం పెంచగానే రవీంద్రనాథ్ ఠాగూర్ అయిపోతారా?
ఎబి. శంకర్, పాలకొల్లు