కేసీఆర్‌ బొమ్మ పెట్టనిదే బీజేపీ నడవదు!

Published: Tue, 28 Jun 2022 02:31:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon

కేసీఆర్‌ బొమ్మ పెట్టనిదే బీజేపీ నడవదు!

అంతటి దుస్థితిలో ఉందా పార్టీ.. కాషాయ పార్టీది నీచ సంస్కృతి

మోదీ బొమ్మకు చెప్పుల దండ వేసి గాడిదలపై ఊరేగించగలం

కానీ, అది మా సంస్కృతి కాదు.. మోదీ రాజ్యాంగం నడుస్తోంది

విపక్షాలపైకి దర్యాప్తు సంస్థలను వేటకుక్కల్లా ఉసిగొలుపుతున్నారు

మేమిచ్చిన దానికంటే కేంద్రం ఎక్కువ ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా 

తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏదీ?.. రిజర్వేషన్ల పెంపుపై స్పందనేదీ?

గిరిజనులను కాల్చి చంపినా ముర్ము మాట్లాడలేదు: ఢిల్లీలో కేటీఆర్‌న్యూఢిల్లీ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీది నీచమైన సంస్కృతి అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజకీయ భావదారిద్ర్యానికి బీజేపీ చేసే చిల్లర రాజకీయాలే ప్రతీక అని ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని విపక్షాలపైకి వాటిని వేటకుక్కల్లా ఉసిగొలిపి, రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీలదేనని చెప్పారు. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై కూడా సీఎం కేసీఆర్‌ బొమ్మ పెట్టకపోతే పార్టీ నడవలేని దుస్థితిలో బీజేపీ ఉందని విమర్శించారు. ఇంగితం, సిగ్గులేనితనానికి పరాకాష్టగా భావిస్తున్నానని చెప్పారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ‘కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌’ పేరిట సీఎం బొమ్మతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేటీఆర్‌ ఈ విమర్శలు చేశారు. ‘‘బీజేపీ కంటే ఎక్కువే చేయగలం. కావాలంటే మేం కూడా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రధాని మోదీ బొమ్మకు చెప్పుల దండ వేసి, గాడిదలపై కూర్చోబెట్టి ఊరేగించగలం. కానీ, అది మా సంస్కృతి కాదు’’ అని వ్యాఖ్యానించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్‌ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధాని మోదీతో సహా జుమ్లా జీవులందరూ హైదరాబాద్‌లో దిగబోతున్నారన్నారు. గత 8 ఏళ్లలో దేశానికి, తెలంగాణకు చేసిందేమిటి? ప్రజలకు ఒరిగిందేమిటో వాళ్లు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గుజరాత్‌కు మోదీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని, అటువంటి రాష్ట్రంలో ఇప్పటికీ విద్యుత్తు లేక అల్లాడుతుంటే ఆయన సమర్థుడా అసమర్థుడా? అని ప్రశ్నించారు. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్తు సౌకర్యం ఉందని ప్రధాని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము స్వగ్రామానికి ఆదివారం విద్యుత్తు సౌకర్యం వచ్చిందని గుర్తుచేశారు. ‘‘ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం చేసిందేంటో చెబితే బాగుంటుంది. విభజన చట్టంలో పేర్కొన్న గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ వంటి హామీలు నెరవేర్చారా? ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారా? తెలంగాణ రాష్ట్రం 8 ఏళ్లలో పన్నుల రూపంలో కేంద్రానికి రూ.3,65,797 కోట్లు చెల్లించింది. దేశం తెలంగాణకు ఎక్కువ ఇచ్చిందా? తెలంగాణ ఈ దేశానికి ఎక్కువ ఇచ్చిందా? అన్న విషయంపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే నాయకులు శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ కేంద్రానికి ఇచ్చిన దాని కంటే.. కేంద్రమే తెలంగాణకు ఎక్కువ ఇచ్చిందని రుజువు చేస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యధికంగా సాయపడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని చెప్పారు.  వీధి వ్యాపారులకు అప్పు ఇచ్చి కూడా మోదీ ప్రకటనలు వేయించుకోవడం అంతటి ఛండాలం మరొకటి ఉండదన్నారు. మోదీ పాలనలో గత 45 ఏళ్లలో లేనంత గరిష్ఠ స్థాయికి నిరుద్యోగం చేరిందని, ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ఠానికి చేరిందని, ఎల్పీజీ సిలిండర్‌ ధరలు ప్రపంచంలోనే ఎక్కడా లేనంత ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. కోటి లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని, పైగా డొల్ల మాటలు మాట్లాడతారని ధ్వజమెత్తారు. కుటుంబ పాలన, అవినీతి వంటి పిచ్చి మాటలు తప్ప అర్థవంతమైన మాటలు ప్రధాని మోదీ చెప్పగలరా? అని ప్రశ్నించారు. అంబానీకి విద్యుత్తు ప్రాజెక్టు ఇవ్వాలంటూ మోదీ ఒత్తిడి తెచ్చారని శ్రీలంక మంత్రే చెప్పినా దానిపై ఎవరూ నోరెత్తరన్నారు. ఇదా రాజ్యాంగం? అని నిలదీశారు.

సంపూర్ణ విశ్వాసంతో మద్దతు.. కానీ..
భారత రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తారన్న సంపూర్ణ విశ్వాసంతోనే యశ్వంత్‌ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతిచ్చామని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌కు రావాలని సిన్హాను ఆహ్వానించామన్నారు. ఆయన వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశంలో 8 ఏళ్లుగా మోదీ హయాంలో అప్రజాస్వామిక చర్యలు, అన్యాయాలకు హద్దూ అదుపు లేకుండా పోతోందని కేటీఆర్‌ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీలు వాటిని తిరస్కరించాలని, అందుకే బీజేపీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును ఓడించడానికి విపక్ష పార్టీలన్నీ ముందుకొచ్చాయని చెప్పారు. యశ్వంత్‌ సిన్హా గెలవాలని, ఆయన రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టాలని ఆశిస్తున్నామని తెలిపారు. అయితే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్లపై సంతకాలు పెట్టినంత మాత్రాన ఆ కూటమిలో ఉన్నట్లు కాదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. యశ్వంత్‌ సిన్హాకు మద్దతివ్వాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌.. కేసీఆర్‌కు ఫోన్‌ చేసి విజ్ఞప్తి చేశారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేలా సిన్హా పని చేస్తారన్న అభిప్రాయంతోనే వారితో ఏకీభవించి, మద్దతివ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.


గిరిజనులను కాల్చి చంపితే ముర్ము మాట్లాడలేదు!
గిరిజన మహిళను టీఆర్‌ఎస్‌ వ్యతిరేకిస్తోందన్న ప్రచారాన్ని ప్రస్తావించగా.. ‘‘మాకు ద్రౌపది ముర్ముపై ఎలాంటి వ్యతిరేకతా లేదు. ఆమె మంచి వ్యక్తే కావచ్చు. కేవలం గిరిజన, మహిళా అభ్యర్థి అనడంలో అర్థం లేదు. ఒడిసాలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న గిరిజనులపై బీజేపీ భాగస్వామిగా ఉన్న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాల్పులు జరిపి 13 మందిని చంపింది. ముర్ము అప్పుడు మంత్రిగా ఉన్నా.. సానుభూతి ప్రకటించలేదు. రాష్ట్రపతి అభ్యర్థిని అడ్డుపెట్టి ఏదో రాజకీయం చేస్తున్న బీజేపీ ఉచ్చులో విపక్షాలు పడిపోతాయనుకోవడం తప్పు. బీజేపీకి గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో వెంటనే గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాలి. రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని ఆమోదించాలి. ఏపీలో కలిపిన ఏడు మండలాలను కూడా తిరిగి ఇవ్వాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. దళిత వర్గానికి చెందిన రాంనాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిని చేశామని బీజేపీ చెప్పుకుంటోందని, దానివల్ల దేశంలోని దళితుల బతుకులు మారిపోయాయా? అని ప్రశ్నించారు. 


బెదిరించి లొంగదీసుకుంటున్నారు..

మహారాష్ట్ర పరిణామాలపై కేటీఆర్‌ స్పందించారు. మోదీ ప్రఽధాని అయిన తర్వాత అప్రజాస్వామిక పద్ధతిలో, మెజారిటీ లేకపోయినా ఇప్పటి వరకు 8 ప్రభుత్వాలను పడగొట్టిన సంగతిని దేశం మొత్తం చూసిందన్నారు. బెదిరించి లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు. సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని, ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి వెంటాడి వేధించి లొంగదీసుకోవాలనే చిల్లర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. 1984లో ఆంధ్రప్రదేశ్‌లో రాంలాల్‌ అనే గవర్నర్‌ను అడ్డంపెట్టుకొని ఇందిరా గాంధీ ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలదోస్తే ప్రజలు తిరగబడి నెల రోజుల్లో ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠ చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం వాళ్ల హవా నడుస్తోందని.. ఏదో ఒకరోజు ప్రజలు తిరగబడతారని స్పష్టం చేశారు. మోదీ రాజ్యాంగమే నడవాలన్న పద్ధతిలో వెళ్తే తిరుగుబాటు తప్పదన్నారు. బహుశా తెలంగాణ నుంచి మొదలవుతుందేమో తెలియదని, కేసీఆర్‌ రూపంలోనో లేదా మరో రూపంలోనో దేశాన్ని చైతన్యవంతం చేసే పరిస్థితి వస్తుందేమోనని అభిప్రాయపడ్డారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.