మేం కూల్చం..వచ్చేది మా ప్రభుత్వమే: అమిత్‌షా

ABN , First Publish Date - 2021-12-06T02:24:24+05:30 IST

రాజస్థాన్‌లో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీతో..

మేం కూల్చం..వచ్చేది మా ప్రభుత్వమే: అమిత్‌షా

జైపూర్: రాజస్థాన్‌లో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఘన విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జోస్యం చెప్పారు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదని, ఎన్నికలతో ప్రజల ముందుకు వెళ్లి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తామని అన్నారు. జైపూర్‌లో ఆదివారంనాడు జరిగిన జన్‌ప్రతినిధి సంకల్ప సమ్మేళన్‌లో అమిత్‌షా పాల్గొని, కాంగ్రెస్, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు.


దేశంలోని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, గరీబీ హఠావో అనేది కేవలం నినాదాలకే ఆ పార్టీ పరిమితం చేసిందని అమిత్‌షా విమర్శించారు. ఇందిరాగాంధీ 'గరీబీ హఠావో' నినాదమిస్తే, అందుకు నిజమైన ప్రయత్నం చేసింది మాత్రం బీజీపీయేనని అన్నారు. పేదల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం టాయిలెట్ల నిర్మాణం, 11 కోట్ల మందికి పైగా సిలెండర్లు అందజేయడం చేసిందని, 60 కోట్ల మంది పేదలకు రూ.5 లక్షల వరకూ వైద్య సౌకర్యం కల్పించామని చెప్పారు.


తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ గత ఏడాది అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం బీజేపీపై ఆరోపణలు చేయడాన్ని అమిత్‌షా తప్పుపట్టారు. ''ప్రభుత్వం కూలిపోతుందనే భయం వాళ్లను (కాంగ్రెస్) ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుంది. ప్రభుత్వాన్ని కూల్చేదెవరు? మీ ప్రభుత్వాన్ని (గెహ్లాట్) బీజేపీ ఎప్పుడూ కూల్చబోదు. ప్రజల ముందుకే బీజేపీ వెళ్తుంది. 2023లో భారీ ప్రజా తీర్పుతో అధికారంలోకి వస్తుంది'' అని అమిత్‌షా అన్నారు. అశోక్ గెహ్లాట్ నిరర్ధక, అవినీతి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడటం, బీజేపీ పగ్గాలు పట్టుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.

Updated Date - 2021-12-06T02:24:24+05:30 IST